ఒకప్పుడు “సమ్మర్ సీజన్ అంటే సినిమాల పండుగ” అనేవారు. రెండు నెలల సెలవులను టార్గెట్ చేస్తూ స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదలై బాక్సాఫీస్‌ను కుదిపేసేవి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నా, ప్లాన్ చేసినట్టుగా సమ్మర్‌కు రిలీజ్ చేయడంలో మేకర్స్ విఫలమవుతున్నారు. ఫలితంగా సమ్మర్ సీజన్ కాస్తా డ్రైగా మారిపోయింది.
ఈ 2026 సమ్మర్ కూడా పెద్ద సినిమాలు లేకుండా చిన్న, మధ్యస్థాయి చిత్రాలతోనే సరిపెట్టుకునేలా కనిపిస్తోంది. అయితే వచ్చే ఏడాది… అంటే 2027 సమ్మర్ మాత్రం ఇప్పటి నుంచే హీట్ పెంచేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు… దాదాపు నాలుగు భారీ ప్రాజెక్టులు బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ఆ సినిమాల లైన్‌అప్ చూస్తే… సమ్మర్ అసలు మాస్ జాతరగా మారడం ఖాయం.
ముందుగా మార్చ్ నెలలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ను మార్చ్ 5న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వంగా స్టైల్ యాక్షన్, ప్రభాస్ క్రేజ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలా పేలుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అదే జోష్‌ను కొనసాగిస్తూ ఏప్రిల్ నెలలో రంగంలోకి దిగబోతున్నారు రాజమౌళి. మహేష్ బాబుతో తెరకెక్కుతున్న ‘వారణాసి’ని ఏప్రిల్ 7న విడుదల చేయాలని ఇప్పటికే ప్రకటించారు. సాధారణంగా రాజమౌళి సినిమా వస్తుందంటే మిగతా హీరోలు దూరంగా ఉంటారు. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే బాక్సాఫీస్ మీద ఎలాంటి ప్రభావం చూపుతాడో తెలిసిందే. ఈసారి షూటింగ్ స్పీడ్ చూస్తుంటే రిలీజ్ డేట్ కూడా మారే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఏప్రిల్ మొత్తం ‘వారణాసి’ హవానే కొనసాగనుంది.
ఇక సమ్మర్ క్లైమాక్స్‌లో అసలు మాస్ జాతర చూపించడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు)ను జూన్ 11న రిలీజ్ చేయాలని మేకర్స్ అనౌన్స్ చేశారు. నీల్ మార్క్ ఎలివేషన్స్, తారక్ ఎనర్జీ కలిస్తే థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం. అయితే సమ్మర్ చివర్లో రిలీజ్ కావడం వల్ల కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలి.
ఇవే కాకుండా… బన్నీ – అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ కూడా సమ్మర్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమా ఏప్రిల్ లేదా మేలో వస్తే… బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల మధ్య అసలైన వార్ మొదలవుతుంది.
ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్… ఈ నలుగురు స్టార్ హీరోలు మూడు నెలల గ్యాప్‌లో సినిమాలు రిలీజ్ చేస్తే థియేటర్ల షేరింగ్, కలెక్షన్స్‌పై భారీ ప్రభావం పడే అవకాశముంది. ఒక సినిమా కలెక్షన్స్‌ను మరో సినిమా దెబ్బతీయొచ్చు కూడా.
ఏది ఏమైనా… 2027 సమ్మర్ మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఫుల్ హీట్‌లోకి తీసుకెళ్లే సీజన్ అవుతుందని ఇప్పటినుంచే క్లియర్‌గా కనిపిస్తోంది!








