మహావతార్ నరసింహ యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. అదే జోష్‌లో నిర్మాత నాగ వంశీ, దర్శకుడు చందు మొండేటితో కలిసి ‘వాయుపుత్ర’ అనే భారీ యానిమేటెడ్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు.
‘కార్తికేయ 2’ వంటి మైథలాజికల్ హిట్, ‘తండేల్’ వంటి సక్సెస్‌లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న చందు మొండేటి ఈ ప్రాజెక్ట్‌ను సులభంగా పూర్తి చేస్తాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా భారీ బడ్జెట్ అవసరం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు తక్కువ ధరలు కోట్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో చందు మొండేటి దృష్టి బాలీవుడ్ వైపు మళ్లింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ‘ఉజ్జయిని’ (వర్కింగ్ టైటిల్) అనే భారీ హిస్టారికల్ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించనుండగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో పాటు రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గతంలో ‘బేబీ’ సినిమాలో కలిసి నటించిన వీరి కాంబో మళ్లీ రిపీట్ అవ్వడం ఆసక్తికరం. అంతేకాక, మరో స్టార్ హీరో కూడా ఈ మల్టీస్టారర్‌లో భాగమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
కథ విషయానికి వస్తే, పురాతన నగరం ఉజ్జయిని నేపథ్యంగా చరిత్ర, పురాణాలు, మిస్టరీల మేళవింపుతో ఈ సినిమాను ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారని టాక్. ‘కార్తికేయ 2’ ద్వారా మైథలాజికల్ జానర్‌లో అనుభవం ఉన్న చందుకు ఇది పెద్ద ప్లస్ కానుంది.
అయితే అట్టహాసంగా ప్రకటించిన ‘వాయుపుత్ర’ ప్రాజెక్ట్ భవిష్యత్తు ఏమిటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందా? లేక ‘ఉజ్జయిని’ తర్వాత మళ్లీ మొదలవుతుందా? అన్నదానిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఒకవైపు “థియేటర్లను దేవాలయాలుగా మార్చేలా ‘వాయుపుత్ర’ను తెరకెక్కిస్తా” అన్న చందు మొండేటి, ఇప్పుడు ‘ఉజ్జయిని’ మిస్టరీని ఛేదించే పనిలో పడటం హాట్ టాపిక్‌గా మారింది. కొందరు అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతుంటే, మరికొందరు “ఇదైనా మధ్యలో ఆగిపోదు కదా?” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా, టాలీవుడ్‌లో తన ప్రతిభను నిరూపించుకున్న చందు మొండేటి ఇప్పుడు బాలీవుడ్ టాప్ బ్యానర్‌తో పాన్ ఇండియా లెవల్‌లో సినిమా చేయడం విశేషమే. ఈ భారీ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!








