యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రంపై ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ‘ఎన్టీఆర్ 31’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
వచ్చే ఏడాది జూన్ 11న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన షాడో లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అంతేకాకుండా, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు పండగ మూడ్‌లోకి వెళ్లిపోయారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా, భారీ అంచనాల నడుమ ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








