విశాఖపట్నంలో కైలాసగిరి వద్ద కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ ఆదర్శ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైన నేపథ్యంలో, అదృష్టవశాత్తు విద్యార్థులు అర్ధరాత్రి సమయానికి క్షేమంగా పిఠాపురం చేరుకున్నారు. ముగ్గురు విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. విద్యార్థులు పిఠాపురం చేరుకునే వరకు తల్లిదండ్రులు పాఠశాల వద్ద పడిగాపులు గాసారు. పాఠశాల కరస్పాండెంట్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సరైన బస్సులను తీసుకువెళ్లకుండా పిల్లల్ని ఇలా ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. దురదృష్ట వశాత్తు జరిగిన ఘటనపై పాఠశాల యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. పిల్లల క్షేమమే తమ బాధ్యతని, అనుకోకుండా జరిగిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కరస్పాండెంట్ వసంత ప్రసాద్ కోరారు.









