కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఎన్నికల అధికారులు మరోసారి ఎన్నికను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సభ నిర్వహించడానికి కోరం సభ్యులు లేకపోవడంతో వరుసగా నాలుగో సారి వాయిదా పడింది. తునిలో వైస్ చైర్మన్ ఎన్నికపై టిడిపి-వైసిపి మధ్య రగడ జరుగుతున్న నేపథ్యంలో తునిలో ఉద్రిక్తత ఏర్పడింది. టిడిపిలోకి చేరిన పదిమంది కౌన్సిలర్లు మాత్రమే ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. దీంతో వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. 17 మంది కౌన్సిలర్లతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా బలనిరూపణ చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు టిడిపి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తోంది. ఎక్స్ అఫీషియోతో కలిపి 29 మంది సభ్యులు ఉన్న తుని మున్సిపల్ కౌన్సిల్లో కోరం సభ్యులు హాజరు కాకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారికి విషయాన్ని తెలియజేసినట్లు చెప్పారు. తదుపరి నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తా మన్నారు.









