నేచురల్ స్టార్ నాని ఇటీవల తన కెరీర్‌కి కొత్త మలుపు తిప్పాడు. ఇప్పటి వరకు లవ్, ఫ్యామిలీ, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్తో పక్కింటి అబ్బాయి ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయన, ‘దసరా’తో మాస్ యాక్షన్ వైపు అడుగుపెట్టాడు. రా అండ్ రగ్గడ్ లుక్‌లో నాని ఆకట్టుకోవడంతో పాటు, ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన ‘హిట్ 3’లో వెండితెరపై రక్తపాతం సృష్టించి, చిన్నపిల్లలు లేదా బ్లడ్ సీన్స్‌కి భయపడేవారు సినిమాకి రాకూడదని స్పష్టంగా చెప్పి పెద్ద రిస్క్ కూడా చేశాడు. అయినా కంటెంట్ బలంగా ఉండటంతో హీరోగానే కాకుండా నిర్మాతగానూ లాభపడ్డాడు.
ప్రస్తుతం నాని పూర్తి ఫోకస్ ‘ది ప్యారడైజ్’ మీదే ఉంది. ‘దసరా’తో హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మళ్లీ జతకడుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. మార్చి 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించడంతో షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో డైలాగ్ కింగ్ మోహన్‌బాబు విలన్‌గా కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనకు సంబంధించిన ఫోటోలు సెట్స్ నుంచి లీక్ కావడంతో యూనిట్ షాక్ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో నిర్మించిన 30 ఎకరాల విస్తీర్ణం ఉన్న స్లమ్ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్లో పవర్ఫుల్ క్యామియో కోసం ఓ స్టార్ హీరోని సంప్రదిస్తున్నారని టాక్.
తాజా సమాచారం ప్రకారం ఆ క్యామియోలో మెగాస్టార్ చిరంజీవి కనిపించే అవకాశం ఉందట. ‘ది ప్యారడైజ్’ తర్వాత శ్రీకాంత్ ఓదెల – చిరంజీవి కాంబినేషన్లో సినిమా పక్కాగా ప్లాన్‌లో ఉండటంతో, ఈ పాత్రకు చిరంజీవి అంగీకరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజమైతే, ఈ సినిమాకి హైప్ మరింత పెరుగడం ఖాయం. సినీప్రియులు కూడా “చిరంజీవి ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది” అంటున్నారు.
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌కి సిద్ధం కానున్నారు..









