యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది.
తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆయనను సంప్రదించిందని, త్వరలో జరగనున్న నెక్స్ట్ షెడ్యూల్‌లో ఆయనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే డార్క్ టోన్, బ్లాక్ అండ్ గ్రే షేడ్స్‌తో కూడిన విజువల్స్ గుర్తుకు వస్తాయి. అయితే, ‘డ్రాగన్’ విషయంలో మాత్రం ఆయన తన స్టైల్‌కు భిన్నంగా ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మొత్తం కలర్‌ఫుల్ విజువల్స్‌తో, ప్రకాశవంతమైన ఫ్రేమ్స్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆశ్చర్యకరంగా, ఆ భాగంలో ప్రశాంత్ నీల్‌కు సిగ్నేచర్‌గా మారిన డార్క్ షేడ్స్ అసలు కనిపించవని టాక్ వినిపిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.






