స్టార్ హీరో ధనుష్ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటూ, తన పని తాను చేసుకుంటూ వెళ్లే నటుడిగా గుర్తింపు పొందారు. అయితే, ఈసారి మాత్రం ఆయన చేసిన రెండు వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవల ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ధనుష్ తెరకెక్కించి నటించిన ‘రాయన్’ చిత్రానికి అవార్డు రావడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే ఏడాది విడుదలైన ‘మహారాజా’, ‘సత్యం సుందరం’ వంటి చిత్రాలు మరింత అర్హత కలిగినవని కొందరు అభిప్రాయపడుతూ విమర్శలు చేశారు.
ఈ విమర్శలపై ధనుష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘రాయన్’ కంటే కొన్ని సినిమాలు మెరుగ్గా ఉండొచ్చు. కానీ నా సినిమాకు అవార్డు రావడంతో చాలామంది ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో నేను చేసిన ‘వడ చెన్నై’, ‘కర్ణన్’, ‘మర్యన్’ వంటి చిత్రాలు జాతీయ అవార్డుకు అర్హమైనవని ఎందుకు ఎవరూ మాట్లాడలేదు?’ అని ఆయన ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే, ధనుష్ చేసిన మరో వ్యాఖ్య రాజకీయ ప్రవేశంపై కూడా చర్చకు దారితీసింది. వేల్స్ మెడికల్ కాలేజ్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, “ఇంత మంది ఒకే లక్ష్యంతో కలిసి రావడం గొప్ప విషయం. ఈ ఐక్యతను కేవలం ఆడియో ఫంక్షన్లు, సమావేశాలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి. మీ ప్రాంతంలోని ప్రజలకు, అవసరమైన కుటుంబాలకు మీ వంతు సహాయం చేయండి. మిమ్మల్ని చూసి నేను మరింత గర్వపడేలా పనిచేయండి” అని పిలుపునిచ్చినట్లు సమాచారం.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నారా? అనే ఊహాగానాలు కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ధనుష్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మొత్తానికి జాతీయ అవార్డుపై ఆయన స్పందన, అలాగే అభిమానులకు చేసిన పిలుపు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.






