ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, త్వరలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సన్నివేశాల్లో బన్నీ గతంలో ఎప్పుడూ కనిపించని వైల్డ్ లుక్‌లో దర్శనమిస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా అట్లీ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారట. ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించడమే లక్ష్యంగా ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో దీపికా పడుకోణె కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ శక్తివంతమైన డాన్ చుట్టూ సాగే ఈ కథలో అల్లు అర్జున్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సన్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.






