దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా 2026 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ ‘స్వతంత్ర బాబాయ్’ అనే ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర పూర్తి వినోదాత్మకంగా ఉండటంతో పాటు, బోల్డ్ షేడ్లోనూ డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఈ పాత్ర ప్రేక్షకులను నవ్వించే కీలక ఆకర్షణగా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది.
అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘చందమామ కథలు’ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. తిరుపతి నేపథ్యంలో, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో జరిగే ఓ ఆసక్తికర సంఘటన ఆధారంగా కథ సాగుతుందని సమాచారం. ఈ కథలో ఆధ్యాత్మికతతో పాటు వినోదం, భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా కథాంశం ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విధంగా ఉంటుందని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా దర్శకుడు అజయ్ భూపతి రూపొందించినట్లు తెలుస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. మరి ‘శ్రీనివాస మంగాపురం’ విడుదల తర్వాత ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.






