గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని, నటుడిగా మరింత ఎత్తుకు చేరుకోవడమే తన లక్ష్యమని క్లారిటీ ఇచ్చారు. తన మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“ఫ్యాన్స్ మిమ్మల్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు… రాజకీయాల్లోకి వస్తారా?” అన్న ప్రశ్నకు చరణ్ స్ట్రైట్‌గా స్పందించారు. “రెండు పడవలపై ప్రయాణం చేయడం నాకు ఇష్టం లేదు. నేను పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాను. నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా టార్గెట్” అంటూ స్పష్టం చేశారు.
ఇక ‘పెద్ది’ సినిమా గురించి మాట్లాడుతూ… ఇది తన కెరీర్లోనే అత్యంత నిజాయతీగా చేసిన సినిమాల్లో ఒకటని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ‘పెద్ది’ అనే యువకుడి జీవిత ప్రయాణం, అతని అస్తిత్వ పోరాటం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చెప్పారు. ఈ పాత్ర కోసం శారీరకంగానే కాదు… మానసికంగానూ చాలా కష్టపడ్డానని వెల్లడించారు.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చరణ్ నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రిస్కీ స్టంట్స్ విషయంలో డూప్‌లను ఎక్కువగా వాడటం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. “నా తండ్రి చిరంజీవి 71 ఏళ్ల వయసులో కూడా స్టంట్స్ చేస్తున్నారు. అలాంటి సన్నివేశాలే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దర్శకుడు బూచి బాబు సాన తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది.








