తెలంగాణ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఒకే వార్త హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ రాజీనామా చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఈ-మెయిల్ ద్వారా ఛాంబర్‌కు సమాచారం ఇచ్చినా.. అసలు కారణం మాత్రం ఇండస్ట్రీలో జరుగుతున్న తాజా వివాదాలేనన్న చర్చ జోరుగా సాగుతోంది.
గత కొంతకాలంగా నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల మధ్య “పర్సంటేజీ వర్సెస్ రెంటల్” వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వసూలు చేస్తున్న పర్సంటేజీలు, VPF ఛార్జీలపై నిర్మాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో థియేటర్ నెట్‌వర్క్ పెద్ద ఎత్తున కలిగిన ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ వైపు వేళ్లు చూపించడంతో పరిస్థితి మరింత హీట్ ఎక్కింది.
ఛాంబర్ అధ్యక్షుడిగా ఉంటూ నిర్మాతలకు సరైన న్యాయం చేయడం లేదనే విమర్శలు కూడా ఆయనపై వచ్చాయి. ఇండస్ట్రీలో పెరుగుతున్న ఒత్తిడి, వివాదాల మధ్యే సునీల్ నారంగ్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక ఆయన రాజీనామాను ఛాంబర్ కార్యవర్గం ఆమోదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈనెల 22న తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశముంది.
సునీల్ నారంగ్ లాంటి కీలక వ్యక్తి పదవి నుంచి తప్పుకోవడం వల్ల, రాబోయే రోజుల్లో థియేటర్ల యాజమాన్యాలు – నిర్మాతల మధ్య ఉన్న వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. కొత్త అధ్యక్షుడు ఈ సమస్యలను ఎలా హ్యాండిల్ చేస్తారు..? ఇండస్ట్రీలో నెలకొన్న ఈ సంక్షోభానికి ఎలాంటి పరిష్కారం తీసుకొస్తారు..? అన్నదే ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రధాన చర్చగా మారింది.







