రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ‘వారణాసి’ సినిమా గ్లింప్స్‌లో కనిపించిన భయానక రూపంలో ఉన్న దేవత ‘ఛిన్నమస్తా దేవి’. ఈమె దశమహావిద్యలలో ఐదవ శక్తి స్వరూపం, ఈ తల్లిని ‘ప్రచండ చండిక’ అని కూడా పిలుస్తారు. ఛిన్నమస్తా అంటే తన తలను తానే నరుక్కున్న దేవత అని అర్థం. అమ్మవారి ఈ ఉగ్ర రూపం వెనుక లోకానికి మేలు చేసే గొప్ప తత్వజ్ఞానం దాగి ఉంది. ఈ రూపం తన అహంకారాన్ని, కోరికలను నాశనం చేసి, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడాన్ని సూచిస్తుంది. ఒక చేతిలో ఖండించిన శిరస్సును, మరొక చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటుంది.
అమ్మవారి మెడ నుండి రక్తం మూడు ధారలుగా ప్రవహిస్తుంది; అందులో ఒక ధారను అమ్మవారి శిరస్సు తాగుతుంది, మిగిలిన రెండు ధారలను ఆమె అనుచరులైన డాకిని వర్ణిని అనే యోగినులు తాగుతారు. ఈ దృశ్యం లోకంలో ఉన్న ప్రతి ప్రాణికి తన శక్తిని ధారపోసే తల్లి అత్యున్నత త్యాగాన్ని తెలియజేస్తుంది. ఈ తల్లి మన్మథుడు, రతీదేవిల సంభోగ భంగిమపై నిలబడి ఉంటుంది. దీని అర్థం, అమ్మవారు కోరికల శక్తిని, లైంగిక వాంఛలను పూర్తిగా జయించింది అని. కామవాంఛలకు బానిసలం కాకుండా, వాటిని దాటి ఉన్నత స్థాయికి ఎదగాలి అనే గొప్ప తత్వాన్ని ఈ రూపం బోధిస్తుంది.
వారణాసి సినిమాకు, ఛిన్నమస్తా దేవికి లింక్ విషయానికి వస్తే, వారణాసి ప్రాంతంలో (కాశీలో) కూడా ఛిన్నమస్తా దేవికి అంకితమైన ఆలయం లేదా శక్తి పీఠం ఉంది. ఝార్ఖండ్‌లోని రాజ్రప్పలో ఈ దేవతకు అత్యంత ప్రసిద్ధ శక్తి పీఠం ఉంది, దీనిని ‘మా చిన్మస్తికే మందిర్’ అని పిలుస్తారు. ఈ ఆలయం అచ్చం వారణాసి గ్లింప్స్‌లో చూపించినట్లుగానే ఉంటుంది. వారణాసి అనేది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక, తాంత్రిక కేంద్రాలలో ఒకటి. అందుకే, శక్తి, జ్ఞానం, త్యాగం అనే లోతైన తత్వాలు ఉన్న ఛిన్నమస్తా దేవిని రాజమౌళి తన కథాంశంలో ప్రధానంగా ప్రస్తావించి ఉండవచ్చు. సినిమా విడుదల అయితేనే ఈ లింక్ యొక్క పూర్తి వివరాలు తెలుస్తాయి.









