సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’. ఈ సినిమాపై ఇప్పటికే గ్లోబల్ లెవెల్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టనున్నారట.
ఇక ‘వారణాసి’ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా అప్‌డేట్స్, విజువల్స్ మూవీపై అంచనాలను మరింత పెంచేశాయి.
ఇదిలా ఉంటే.. ఇటీవల అమెరికాలోని ప్రతిష్టాత్మక పెన్ స్టేట్ యూనివర్సిటీ ఫిల్మ్ స్కూల్ విద్యార్థులతో రాజమౌళి ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘వారణాసి’లో మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్ర గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు మహేష్ బాబు నుంచి తనకు కావాల్సిన అవుట్‌పుట్‌ను ఎలా రాబట్టాలి అనే విషయంలో తాను ఆలోచించానని రాజమౌళి తెలిపారు. కానీ మహేష్ బాబు సెట్‌లోకి వచ్చిన తర్వాత ఆయన నటన చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పారు.
ఒక దర్శకుడిగా నటుడి నుంచి 100 శాతం అవుట్‌పుట్ ఆశిస్తే.. మహేష్ బాబు మాత్రం తన అంచనాలను మించి మరింత ఎఫర్ట్ పెట్టారని రాజమౌళి చెప్పుకొచ్చారు. రుద్ర పాత్రలో మహేష్ బాబు నటించడం మాత్రమే కాకుండా.. ఆ పాత్రలో పూర్తిగా జీవించారని ప్రశంసించారు.
అలాగే తన సినిమాల్లో స్టార్ హీరో ఉండాలనే ఉద్దేశంతో నటీనటులను ఎంపిక చేయనని రాజమౌళి తెలిపారు. కథకు, పాత్రలకు ఎవరు సరిపోతారో వారినే ఎంపిక చేస్తానని వెల్లడించారు.
ఇక ‘వారణాసి’లో మహేష్ బాబుతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో, పృథ్వీరాజ్ కుంభ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
‘RRR’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ‘వారణాసి’పై అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. మునుపెన్నడూ చూడని విజువల్ వరల్డ్‌ను ఈ సినిమాతో రాజమౌళి చూపించబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు.
మహేష్ బాబు షూటింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. కొన్ని ప్యాచ్ వర్క్స్ మినహా ప్రధాన షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో.. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి టీమ్ బిజీ కానుంది. మరి ‘వారణాసి’ ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.








