యువ హీరో సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన సినిమా ఇది. దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. దీంతో అసలు జాసన్ సంజయ్ తన తొలి సినిమాను ఎలా తెరకెక్కించాడు అనే ఆసక్తి మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఉంది.
తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ విషయానికి వస్తే..
వైజాగ్‌కు చెందిన గురు పాత్రలో సందీప్ కిషన్ కనిపిస్తాడు. తన తల్లికి ఎంతో ఇష్టమైన హోమ్ లైబ్రరీని నడుపుతూ సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే అతని తండ్రి చేసిన కోటి రూపాయల అప్పు గురు జీవితాన్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ అప్పును ఎలాగైనా తీర్చాలనే ఆలోచనలో ఉన్న అతనికి అనుకోకుండా ఒక ప్రమాదకరమైన డ్రగ్ బిజినెస్ గురించి తెలుస్తుంది.
విన్సెంట్ నడిపించే ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించిన కీలక ఆధారాలు గురు చేతికి రావడంతో.. డబ్బు కోసం అతన్ని బ్లాక్మెయిల్ చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఈ మొత్తం వ్యవహారం వెనుక ఇంటర్నేషనల్ స్మగ్లర్ కోట్లపాటి వెంకట రెడ్డి ఉన్నాడని అతనికి తెలియదు.
మరి గురు ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు? తనకు కావాల్సిన డబ్బు దొరికిందా? తండ్రి చేసిన అప్పును తీర్చగలిగాడా? చివరకు విలన్లను ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్
ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ గురించి. దర్శకుడు జాసన్ సంజయ్ విజన్‌ను నమ్మి సందీప్ తన పాత్రను నిజాయితీగా పోషించాడు. సినిమా మొత్తం అతని హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సందీప్ కిషన్ బాగా ఆకట్టుకున్నాడు.
ఫరియా అబ్దుల్లాకు పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కలేదు. కొన్ని సన్నివేశాలకే ఆమె పాత్ర పరిమితమైంది. ఉన్నంతలో మాత్రం ఓకే అనిపిస్తుంది.
ఇక సంపత్ రాజ్‌కు మాత్రం మంచి రన్‌టైమ్ దక్కింది. తనదైన స్టైల్లో విలన్ పాత్రను బాగానే పోషించాడు.
మైనస్ పాయింట్స్
అసలు సినిమా సమస్య కథలో కంటే స్క్రీన్‌ప్లేలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మొదటి సన్నివేశాల నుంచే ఇది పెద్దగా కొత్తదనం లేని రొటీన్ కథ అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఒక సింపుల్ పాయింట్‌ను తీసుకోవడం తప్పు కాదు. కానీ దానికి ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే జోడించకపోవడంతో సినిమా చాలా చోట్ల నెమ్మదిగా సాగుతుంది. హీరో-హీరోయిన్ ట్రాక్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించదు.
ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ కూడా ప్రేక్షకుల్లో బలమైన ఎమోషన్ తీసుకురావడంలో విఫలమవుతుంది. హీరో జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని కోల్పోయిన సమయంలో అతని పాత్రలో కనిపించాల్సిన బాధ, ఎమోషన్ సరైన స్థాయిలో చూపించలేకపోయారు.
సెకండాఫ్‌లో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతుంది. కథ ఒక స్పష్టమైన దిశ లేకుండా అటూ ఇటూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. హీరో, అతని గ్యాంగ్ విదేశాలకు వెళ్లి భారీ దోపిడీ చేయడం వంటి అంశాల్లో లాజిక్ మిస్సవుతుంది.
కొన్ని సన్నివేశాలను అవసరానికి మించి గందరగోళంగా తెరకెక్కించారు. ఒకే తరహా సీన్లు రిపీట్ అవుతూ ఉండటం కూడా ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది.
సీరియస్ సన్నివేశాల మధ్యలో వచ్చే కామెడీ కూడా చాలా చోట్ల సినిమా ఫ్లోను దెబ్బతీస్తుంది. దాంతో ఆ సన్నివేశాలకు రావాల్సిన ఎమోషన్, ఇంపాక్ట్ తగ్గిపోతాయి.
చివరికి క్లైమాక్స్ కూడా పెద్దగా థ్రిల్ లేదా ఉత్కంఠను ఇవ్వకుండా ముగుస్తుంది.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే..
నిర్మాణ విలువలు యావరేజ్‌గా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్, VFX వర్క్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. థమన్ అందించిన సంగీతం కూడా సినిమాకు పెద్దగా ప్లస్ కాలేకపోయింది.
కెమెరా వర్క్ పర్వాలేదనిపించినా, ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా అనవసరమైన సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్‌గా ఉండేది.
ఇక దర్శకుడు జాసన్ సంజయ్ విషయానికి వస్తే.. తన మొదటి సినిమాతో మంచి ఇంప్రెషన్ ఇవ్వాలనే ప్రయత్నం కనిపిస్తుంది. కానీ రొటీన్ కథకు సరైన స్క్రీన్‌ప్లే, బలమైన రైటింగ్‌ను జోడించడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు.
సందీప్ కిషన్ తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ.. దర్శకుడి రైటింగ్, డైరెక్షన్లో ఉన్న లోపాలు సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి.
మొత్తంగా చెప్పాలంటే.. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ, రొటీన్ కథ, వీక్ స్క్రీన్‌ప్లే, లాజిక్ లేని సన్నివేశాలు, నెమ్మదైన నేరేషన్ కారణంగా ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది.








