జబర్దస్త్ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వేణు ఎల్దండి.. దర్శకుడిగా మారి ‘బలగం’ సినిమాతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గ్రామీణ భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా చూపించిన ఈ చిత్రం వేణుకు జాతీయస్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పుడు అదే భావోద్వేగాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు వేణు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఎల్లమ్మ’ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
హీరోయిన్ కోసం భారీగా జరిగిన వెతుకులాట
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. అందుకే దర్శకుడు వేణు ఈ పాత్ర కోసం సరైన నటిని ఎంపిక చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. మొదట ఈ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించినట్లు టాక్ వినిపించింది. అయితే డేట్స్ సమస్యల కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం కీర్తి సురేష్ పేరు కూడా బలంగా వినిపించింది. కొంతకాలం ఆమెనే హీరోయిన్గా ఫిక్స్ చేశారని ప్రచారం జరిగినా.. చివరికి ఆ వార్తలు నిజం కాలేదు.
ఇక మధ్యలో శృతిహాసన్, రుక్మిణి వసంత్ పేర్లు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ‘సీతారామం’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్‌ను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో తన సహజమైన నటనతో ఆకట్టుకునే మృణాల్.. ‘ఎల్లమ్మ’ సినిమాకు మరింత బలం తీసుకువస్తుందని మేకర్స్ భావిస్తున్నారట.
హీరోగా DSPకి భారీ అవకాశం
ఈ చిత్రంలో దేవిశ్రీప్రసాద్ “పార్శి” అనే పవర్ఫుల్ పాత్రలో హీరోగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆయన లుక్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంగీత దర్శకుడిగానే కాకుండా ఈ సినిమాకు హీరోగా కూడా DSP కొత్త ప్రయాణం మొదలుపెడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అంతేకాదు, ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తుండటం మరో విశేషం.
తెలంగాణ సంస్కృతిని చూపించే కథ
‘ఎల్లమ్మ’ సినిమా తెలంగాణ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక అంశాలు, జానపద కళల నేపథ్యంలో రూపొందుతున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో వేప ఆకులు, పసుపు, కుంకుమ, గజ్జెల శబ్దాలతో చూపించిన విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
త్వరలోనే హీరోయిన్‌పై అధికారిక ప్రకటన వెలువడనుండగా.. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుందని సమాచారం. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మృణాల్ ఠాకూర్ పేరు వినిపించడంతో సోషల్ మీడియాలో “DSP నిజంగానే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు” అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.








