ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రెబెల్ ఎంపీగా తాను అనుభవించిన పరిస్ధితుల్ని, అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాను ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇవాళ అసెంబ్లీలో వివరించారు. డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రఘురామ.. ఈ అసెంబ్లీలో తన తొలి, చివరి బడ్జెట్ ప్రసంగం చేశారు. దీంతో ప్యానెల్ స్పీకర్ గా ఉన్న విష్ణుకుమార్ రాజుకూ, రఘురామకూ మధ్య ఆసక్తికర సంభాషణ కూడా చోటు చేసుకుంది.
రేపటి నుంచి వారు(రఘురామ) వేరే పదవిలోకి వెళ్తారు, కొంచెం ఓపెన్ గా మాట్లాడే అవకాశం ఇది అని ప్యానెల్ స్పీకర్ గా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. దీంతో ప్రసంగం చేసేందుకు సీటులో నుంచి లేచిన రఘురామ..
రేపటి నుంచి నా కష్టాన్ని గుర్తించి ఆఖరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు. అనంతరం తన ప్రసంగం ప్రారంభించారు. ప్రస్తుతం కత్తీ మీద సాముకన్నా చాలా క్లిష్టమైన పరిస్ధితి రాష్ట్రంలో ఉందని రఘురామ తెలిపారు.
మనం ఊహించిన దాని కన్నా చాలా అస్తవ్యస్తంగా ఆర్ధిక పరిస్ధితి ఉందని, ఆ షాక్ నుంచి ఆర్ధిక బయటపడటానికే చాలాటైమ్ పట్టిందని రఘురామ చెప్పుకొచ్చారు. సీఎం కూడా ఇంత విధ్వంసం జరిగిందని భావించలేదన్నారు, అయినా ఇంత బడ్జెట్ ఇవ్వగలిగారంటే అది చంద్రబాబుకే సాధ్యమని రఘురామ తెలిపారు. కొంచెం సమయం పట్టినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సి ఉందన్నారు. నారా లోకేష్ లక్షా 50 వేల కోట్ల ప్రాజెక్టు తెచ్చారని, రిలయన్స్ 65 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
సంక్షేమాన్ని పక్కనబెట్టకుండా అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు.
అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో తనను నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకున్నప్పుడు ఢిల్లీలో కూర్చుని కేంద్ర ఆర్థికమంత్రికి లేఖలు రాశానని రఘురామ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో వైసీపీ సర్కార్ కు ఇంకో లక్ష కోట్లు అప్పు దొరక్కుండా అడ్డుకోగలిగానని రఘురామ వెల్లడించారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారు సీఎం, ఆర్ధిక మంత్రి బడ్జెట్ అమలుకు పడుతున్న ఇబ్బందులు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నారేది గుర్తించారన్నారు.
విపక్ష వైసీపీ అసెంబ్లీకి రాకపోయినా రోజూ ఇంట్లో సెట్టింగ్ వేసుకుని మాట్లాడుకోవడం చూస్తున్నామంటూ సెటైర్లు వేశారు.
ఈ పరిస్ధితిని ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలన్నారు. పథకాలు ఒకదాని వెంట మరొకటి వస్తాయని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న సందేశం ప్రజలకు తీసుకెళ్లాలని తెలిపారు. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రెవెన్యూ లోటు జీరో ఉండాలని, ఆర్ధిక లోటు 3 శాతం దాటకూడదని చెబుతోందన్నారు.








