అసెంబ్లీలో రాజకీయ విమర్శలు.. ప్రతివిమర్శలు.. నిరసనలు.. వాకౌట్లు సహజం. అయితే, ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు రసాబసగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు బీప్ సౌండ్ వచ్చేంతలా వ్యక్తిగత దూషనలకు దిగుతున్నారు. తాజాగా ఈ జాబితాలో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ చేరింది. అయితే, ఇక్కడి ఎమ్మెల్యేలు ఒక అడుగు ముందుకు వెసి, శాసన సభాపతి సాక్షిగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఇప్పుడు ఈ అసెంబ్లీ రౌడీల స్ట్రీట్ ఫైట్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
పోస్టర్ ప్రదర్శనతో రచ్చ..
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు సమావేశం ప్రారంభం కాగానే, ఆర్టికల్ 370 పునరుద్ధరణపై రచ్చ మొదలైంది. ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు వీధి రౌడీల్లా పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఇంజినీర్ రషీద్ సోదరుడు, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370 పునరుద్ధరించాలంటూ అసెంబ్లీలో పోస్టర్ను ప్రదర్శించడంతో రచ్చ మొదలైంది.
రణరంగంగా మారిన సభ..
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే నేత సునీల్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం మొదలైంది. ఎమ్మెల్యేలు ఒక్కోక్కరిగా దూసుకొచ్చారు. పిడిగుద్దులతో సభను రణరంగంగా మార్చేశారు. పరిస్థితి చేయిదాటిపోతుండడంతో స్పీకర్ వెంటనే సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వీడియో కాస్తా వైరల్ అవ్వడంతో ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.








