సోషల్ మీడియా వేదికగా మహిళలను, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత కొంతకాలంగా తనపై వస్తున్న అశ్లీల కామెంట్లు, వ్యక్తిగత దూషణలపై నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, అసభ్య పదజాలంతో వేధిస్తున్న నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై ఆమె ఫిర్యాదు చేయగా, పోలీసులు దీనిని సీరియస్‌గా తీసుకుని రంగంలోకి దిగారు.
సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు, రేణు దేశాయ్‌ను వేధించిన కేసులో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలింపును మరింత వేగవంతం చేశారు. కేవలం రేణు దేశాయ్ మాత్రమే కాకుండా, మరో నటి అనసూయను వేధించిన కేసులో కూడా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ అకౌంట్లతో దాక్కున్నా సరే, సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
సెలబ్రిటీలే కాకుండా సామాన్య మహిళలు కూడా ఆన్‌లైన్ వేధింపులకు గురైతే ఏమాత్రం వెనుకాడకుండా ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. “చీకట్లో ఉండి కామెంట్లు చేస్తే ఎవరూ పట్టుకోలేరని అనుకోవద్దు” అంటూ కేటుగాళ్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బాధితులకు అండగా ఉంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళలకు పోలీసులు భరోసా ఇచ్చారు.








