పరాయి వ్యక్తితో మాట్లాడిందనే నెపంతో అక్రమ సంబంధం అంటగట్టి అత్తింటి వారు, గ్రామ పెద్దల సమక్షంలో బలవంతపు వివాహం చేయించారని ఓ వివాహిత ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముమ్మిడివరం మండలం తానేలంక చిన్న పేట కు చెందిన మెల్లం దయామణి అదే గ్రామం లోని పాఠశాలలో స్వీపర్ గా పనిచేస్తుంది. భర్త నాగార్జున కూడా అదే పాఠశాలలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.తన ఉద్యోగ విషయమై పంచాయతీ వార్డు సభ్యుడు వివాహితుడైన ఇసుక పట్ల ఈశ్వర్ కుమార్ తో మాట్లాడుతుండగా, అది చూసిన అత్తింటి వారు తనకు అతనికి అక్రమ సంబంధం అంటగట్టి పెద్దల సమక్షంలో తగువుపెట్టి తనకు, ఈశ్వర్ కుమార్ తో బలవంతంగా వివాహం జరిపించారని దయామణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ముమ్మడివరం ఎస్ఐ జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
