పిఠాపురంఎమ్మెల్యే తాలూకా అంటే రాష్ట్రంలో ట్రెండింగ్‌లో ఉన్న నాయకుడు పవన్. రాష్ట్రంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దాదాపుగా అదే స్పీడులో టిడిపిలో పాతుకుపోయిన గట్టి నేతగా వర్మ ఉన్నారు. వాస్తవానికి వర్మ ఎక్కడ తగ్గరు. కానీ పవన్ విషయంలో మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పవన్‌కు మద్ధతిచ్చి పవన్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే , వర్మ సీటు త్యాగం చేసిన తర్వాత నుండే ఆయనకు కష్టాలు ఎదురయ్యాయి. తీరా పవన్ గెలిచిన తర్వాత ఏదైనా సక్సెస్ ఉందా అంటే, జనసేన నుండి కనీసం గాలి కూడా వర్మ వైపు వీయడం లేదు. దీంతో క్యాడర్ పూర్తి నిస్తేజంలో ఉండిపోయింది.
అసలే ముక్కోపని వర్మకు పేరుంది. ఇక జనసేన నాయకులు చేస్తున్న హడావుడిలో వర్మను భాగస్వామ్యం చేయకపోవడంతో వర్మ ఎక్కడికక్కడ తన మనస్సులో మాటను బయటపెట్టేస్తున్నారు. అందుకు ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలే ఉదాహరణ, రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన గ్రామసభలు పిఠాపురం నియోజకవర్గంలో కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. అయితే గ్రామ సభల ముందు రోజు రాత్రి వరకూ వర్మకు పిలుపులేకపోవడంతో, గ్రామాలలో టిడిపి క్యాడర్‌కు వర్మ సమాధానం చెప్పలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. స్వయంగా ఇదే విషయాన్ని వర్మ కలెక్టర్ షాన మోహన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆతర్వాత అధికారుల నుండి పిలుపులు రావడంతో సర్థుకుపోయారు. ఇటీవల పిఠాపురం పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలకు పవన్ కళ్యాణ్ సహకారంతో చీరలు పంపిణీ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వర్మకు పిలుపు లేదు. పైగా తమ క్యాడర్‌లో ఒక్కరికి కూడా ఒక్కటంటే ఒక్క వ్రత టోకెన్ పాసు ఇవ్వలేదని వర్మ ఫైర్ అయ్యారు. తనను ఏలాగూ పిలవరు. కానీ టిడిపి క్యాడర్‌కు పాసులు ఇచ్చామని ప్రచారం చేసుకున్నారు. ఇది ముమ్మాటికి అధికారుల తప్పిదమేనని పాదగయ ఈవో దుర్గభవానీనిని ప్రశ్నించారు. దీంతో ఆమె పాసులు ఇవ్వలేదనే సమాధానం చెప్పింది. ఇలా చెప్పుకుంటూ పోతే వర్మ వెర్సెస్ జనసేన లా పిఠాపురంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై టిడిపి క్యాడర్ గుర్రుగా ఉండటంతో ఈ అంశం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో అధినేతల నిర్ణయం ఎలా ఉండబోతోందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో పక్క వర్మ జనసేన నేతలకు విలువ ఇవ్వకపోవడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయన్న వాదన కూడా లేకపోలేదు.
పిఠాపురంలో ఎమ్మెల్సీ హవా..
ఇటీవల జనసేన ఎమ్మెల్సీగా ఎన్నికైన పిడుగు హరిప్రసాద్ పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించారు. పిఠాపురంలో ఏ అధికారిక కార్యక్రమమైనా ఆయనే హాజరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పిఠాపురంలో వర్మకు ప్రాధాన్యత బాగా తగ్గించారు. ఇది వర్మకు బ్రేక్ పెట్టడానికా అంటే అది పూర్తిగా పైకి తేలడం లేదు.
మరోపక్క అధికారిక కార్యక్రమాలు ఏ ఒక్క దానికి వర్మకు ఆహ్వానం లేకపోవడంతో పొమ్మనలేక పొగబెట్టినట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. టిడిపి ఆఫిషియల్ కార్యక్రమాలు మాత్రం వర్మ ఆధ్వర్యంలో యధావిధిగా జరిగిపోతున్నాయి. కానీ ఎమ్మెల్సీ చేపడుతున్న కార్యక్రమాలకు టిడిపి, బీజేపీ నేతలకు పిలుపులేకపోవడంతో పిఠాపురంలో ఎమ్మెల్సీ హవా కొనసాగుతుందనే ప్రచారం జోరందుకుంది. మొత్తంగా పిఠాపురంలో రాజకీయ పరిణామాలు మాత్రం అంతర్గతంగా హాట్ హాట్‌గానే ఉన్నాయి.