సహజ నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటి సాయిపల్లవి.. తన పాత్రల కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడానికి వెనుకాడరు. తాజాగా తన కొత్త సినిమా కోసం ఆమె చేసిన మేకోవర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎస్ అధికారిణి పాత్రలో కనిపించేందుకు తన పొడవాటి జుట్టును కత్తిరించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే సాయిపల్లవి కొత్త లుక్ చూసి ఆమె తల్లిదండ్రులు సైతం షాక్ అయ్యారట.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిపల్లవి.. ఈ సినిమాలోని పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు. కథ విన్నప్పుడే పాత్రకు తగ్గట్టుగా తన రూపాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నానని, అందులో భాగంగానే జుట్టును కత్తిరించుకోవడానికి సిద్ధపడ్డానని చెప్పారు.
ముందుగా తన కొత్త హెయిర్ స్టైల్‌ను వీడియో కాల్ ద్వారా తల్లికి చూపించారట సాయిపల్లవి. అయితే ఒక్కసారిగా ఆమె లుక్ చూసిన తల్లి ఆశ్చర్యపోయి ఎన్నో ప్రశ్నలు అడిగి ఫోన్ కట్ చేశారట. ఆ తర్వాత తండ్రి ఫోన్ చేసి.. నిజంగానే జుట్టు కత్తిరించుకున్నావా? లేక విగ్ పెట్టుకున్నావా? అని అడిగారని సాయిపల్లవి నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. ఇది సినిమా పాత్ర కోసమేనని వివరించడంతో వారు కూడా క్రమంగా ఆ కొత్త లుక్కు అలవాటు పడ్డారని తెలిపారు.
ఇక ఈ మేకోవర్‌పై దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి కూడా స్పందించారు. సినిమాలో నిత్యా రెడ్డి అనే ఐపీఎస్ అధికారిణిగా సాయిపల్లవి కనిపించనున్నారని, ఎర్రచందనం అక్రమ రవాణా కేసును దర్యాప్తు చేసే అధికారిణి పాత్రకు పొట్టి జుట్టు ఎంతో సహజంగా ఉంటుందని భావించినట్లు చెప్పారు. నిజ జీవిత ఐపీఎస్ అధికారి మెరిన్ జోసెఫ్ లుక్ నుంచి కూడా స్ఫూర్తి పొందినట్లు వెల్లడించారు.
ఈ సినిమాలో సాయిపల్లవితో పాటు ధనుష్, మమ్ముట్టి, శ్రీలీల, నసీరుద్దీన్ షా వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. మరి ఐపీఎస్ అధికారిణిగా సాయిపల్లవి తన నటనతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.









