టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. ఇప్పుడు కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘రామాయణ’ సినిమాలో రావణుడి భార్య మండోదరిగా కనిపించి మరోసారి వార్తల్లో నిలిచారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న కాజల్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా భర్త గౌతమ్ కిచ్లుతో తన ప్రేమ ప్రయాణంలో ఎదురైన బ్రేకప్ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు దాదాపు 14 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నారట. అయితే తమ ప్రేమ ప్రయాణం ఎప్పుడూ సాఫీగా సాగలేదని కాజల్ వెల్లడించారు. కొన్ని పరిస్థితుల కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, దీంతో ఒక సమయంలో విడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట.
అంతేకాదు, విడిపోయిన తర్వాత తామిద్దరం వేరే వ్యక్తులతో కూడా డేటింగ్ చేసినట్లు కాజల్ చెప్పుకొచ్చారు. అయితే ఇతరులతో రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ, తమ మధ్య ఉన్న అనుబంధం ఎంత ప్రత్యేకమైనదో ఇద్దరికీ అర్థమైందని తెలిపారు. ఒకరికొకరు ఎంత ముఖ్యమో తెలుసుకున్న తర్వాత మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.
రెండోసారి కలిసినప్పుడు మాత్రం తమ బంధం విషయంలో ఇద్దరూ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈసారి కలిసి ప్రయాణం మొదలుపెడితే జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలని, లేదంటే శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు కాజల్ తెలిపారు. అదృష్టవశాత్తూ తమ ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు చేరిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఇక 2020 అక్టోబర్ 30న కుటుంబ సభ్యుల సమక్షంలో కాజల్, గౌతమ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. తల్లి అయిన తర్వాత కూడా సినిమాలపై తనకున్న ఆసక్తిని కొనసాగిస్తూ కాజల్ కెరీర్లో ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం ‘రామాయణ’ సినిమాలో మండోదరి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్.. త్వరలోనే బాలకృష్ణ నటిస్తున్న ‘దాదా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మొత్తానికి 14 ఏళ్ల ప్రేమ ప్రయాణంలో బ్రేకప్ ఎదురైనా, చివరకు తన ప్రేమనే పెళ్లి చేసుకున్న కాజల్ లవ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.









