నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అధికారిక అప్డేట్ వస్తుందా అని బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఆమె ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
అయితే ఇది ప్రస్తుతం వినిపిస్తున్న వార్త మాత్రమే. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక లీకులు, రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక కొరటాల శివ సినిమాలంటే కథతో పాటు కథ జరిగే నేపథ్యానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. తన సినిమాల్లో ఒక ప్రాంతం, అక్కడి ప్రజల జీవనశైలిని కథలో భాగంగా చూపించడం ఆయన స్టైల్. మరి బాలయ్యతో తెరకెక్కించబోయే ఈ సినిమా నేపథ్యం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
అంతేకాదు, ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ‘దేవర’ తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో కథ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తాయో చూడాలి.








