టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే వరుసగా వార్తల్లో నిలుస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే బిజినెస్ వర్గాల్లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం టాలీవుడ్‌లోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలుగు హక్కుల కోసం బడా సంస్థల పోటీ!
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘వారణాసి’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దక్కించుకునేందుకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు చెందిన దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ రైట్స్ కోసం దాదాపు రూ.275 కోట్ల వరకు ఆఫర్లు వినిపిస్తున్నాయని సమాచారం.
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల్లో రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ సినిమాకు దాదాపు రూ.225 కోట్ల స్థాయిలో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పుడు అదే రాజమౌళి నుంచి వస్తున్న ‘వారణాసి’కి ఏకంగా రూ.275 కోట్ల వరకు ఆఫర్లు వస్తున్నాయనే వార్తలు.. సినిమా బిజినెస్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచుతున్నాయి.
ఇంకా డీల్ క్లోజ్ కాలేదట!
అయితే ‘వారణాసి’ తెలుగు థియేట్రికల్ డీల్ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ప్రముఖ సంస్థలు పోటీ పడుతుండటంతో.. మేకర్స్ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాదు.. రాజమౌళి సినిమాల బిజినెస్‌ను గతంలో చూసిన సంస్థలు కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
పోటీ ఇదే స్థాయిలో కొనసాగితే.. ఫైనల్ డీల్ క్లోజ్ అయ్యే సమయానికి ఆఫర్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
2027లో ‘వారణాసి’ రిలీజ్!
ఇక సినిమాకు వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు మహేష్ బాబు తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కేవలం బాక్సాఫీస్ విషయంలోనే కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళి గత చిత్రం ‘RRR’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘వారణాసి’పై అంచనాలు మరింత పెరిగాయి.
మరి రిలీజ్‌కు ముందే బిజినెస్‌లో ఈ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న ‘వారణాసి’.. విడుదల తర్వాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!







