ఇండియన్ సినిమా నుంచి కొన్ని సినిమాలు మాత్రమే భాషలు, దేశాల హద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాయి. అలాంటి అరుదైన సినిమాల జాబితాలో ఇప్పుడు కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ కూడా చేరింది.
నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఆ తర్వాత చైనాలో కూడా విడుదలై అక్కడ మంచి స్పందనను అందుకుంది. మొత్తంగా ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.
ఇక ఇప్పుడు ‘మహారాజా’ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతోంది. ఈ సినిమా హాలీవుడ్లో రీమేక్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు. గత కొన్ని రోజులుగా ‘మహారాజా’ హాలీవుడ్లో రీమేక్ కాబోతుందంటూ వార్తలు, రూమర్స్ వినిపించాయి.
తాజాగా ఆ వార్తలకు చెక్ పెడుతూ.. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ‘మహారాజా’ రీమేక్ కానున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఒక భారతీయ సినిమా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
అంతేకాదు, ఈ రీమేక్‌లో ఓ ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అయితే హీరో ఎవరనే విషయంపై ప్రస్తుతానికి పూర్తి క్లారిటీ లేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
విజయ్ సేతుపతి ‘మహారాజా’ ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.








