టాలీవుడ్లో రాక్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా, ఇటీవల దేవి శ్రీ ప్రసాద్ కూడా షూటింగ్లో జాయిన్ అయ్యాడు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారనే విషయంలో కొంతకాలంగా పలు పేర్లు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటివరకు హీరోయిన్ విషయంలో అధికారిక ప్రకటన చేయలేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన సమాచారం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ‘ఎల్లమ్మ’లో దేవి శ్రీ ప్రసాద్‌కు జోడీగా యువ నటి అనంతిక సనిల్‌కుమార్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కథలో హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అనంతిక అయితే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావించిన దర్శకనిర్మాతలు ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తెలంగాణ నేటివిటీ, ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్గా నటిస్తున్నారనే వార్తపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.








