సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి టాలెంటెడ్ నటులతో గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా గురించి రాజమౌళి ఎప్పటికప్పుడు పలు ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌ల ద్వారా ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో సుమారు 25 నిమిషాల పాటు సాగే రామాయణ ఎపిసోడ్ ఉండబోతుందనే విషయం ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
అయితే తాజాగా ఈ రామాయణ ఎపిసోడ్‌కు సంబంధించి రాజమౌళి మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సినిమాలో రామాయణ యుద్ధ ఘట్టాన్ని ఒకే ఎపిసోడ్‌గా చూపించబోవడం లేదని ఆయన తెలిపారు.
కథకు అనుగుణంగా రామాయణానికి సంబంధించిన సన్నివేశాలను చిన్న చిన్న సబ్ ఎపిసోడ్స్‌గా విభజించి, సందర్భానుసారం సినిమాలో చూపించబోతున్నట్లు రాజమౌళి వెల్లడించారు. అంటే సినిమా మొత్తం ఒకేసారి రామాయణ ఎపిసోడ్‌ను చూపించకుండా, కథనం ముందుకు సాగే సమయంలో అవసరమైన సందర్భాల్లో ఆ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కనిపించనున్నాయన్నమాట.
రాజమౌళి చేసిన ఈ కామెంట్స్‌తో ‘వారణాసి’ కథనం ఎలా ఉండబోతుంది? రామాయణ ఎపిసోడ్స్‌ను అసలు కథతో ఎలా కనెక్ట్ చేయబోతున్నారు? అనే ఆసక్తి మరింత పెరిగింది.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌కు రాజమౌళి విజన్ తోడవుతుండటంతో ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







