కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘సర్దార్’ సినిమా 2022లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ‘సర్దార్ 2’ పేరుతో సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆషికా రంగనాథ్, రజీషా విజయన్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించగా.. ఎస్.జే. సూర్య కీలక పాత్రలో కనిపించారు. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సర్దార్ 2’ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం.
కథ విషయానికి వస్తే.. 1981లో జపాన్‌కు సంబంధించిన ఒక కాప్సిల్ ఇండియాలో ఉండిపోతుంది. అందులో అత్యంత ప్రమాదకరమైన బయో వెపన్ ఉంటుంది. అడవిలో వదిలివేయబడిన ఆ కాప్సిల్ నుంచి విషవాయువులు లీక్ అవుతూ ఉండటంతో, అక్కడ నివసించే గిరిజనులు అనారోగ్యానికి గురవుతూ ప్రాణాలు కోల్పోతుంటారు.
అయితే ఈ కాప్సిల్‌ను యాక్టివేట్ చేయాలన్నా, డీయాక్టివేట్ చేయాలన్నా మూడు కీలకమైన తాళాలు అవసరం. ఆ మూడు కీస్ గతంలో ‘రా’లో పనిచేసిన వాల్రస్, జారా, ఏజెంట్ టైగర్ దగ్గర ఉంటాయి. ఈ మూడు కీస్ ఒకేసారి ఉపయోగిస్తేనే కాప్సిల్‌ను ఓపెన్ చేయడం సాధ్యమవుతుంది.
ఇదిలా ఉండగా.. ‘రా’ టీమ్‌కు సహకరిస్తున్న సర్దార్ అడవిలోని గిరిజనుల పరిస్థితిని చూసి చలించిపోతాడు. ఈ బయో వెపన్ కారణంగా వస్తున్న వ్యాధికి విరుగుడు మందు జపాన్ దగ్గర ఉందని తెలుసుకుంటాడు. ఆ మందును ఇండియా మీదుగా తరలిస్తున్న సమయంలోనే అడ్డుకుని, గిరిజనుల ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకుంటాడు.
ఈ క్రమంలో ‘ఆపరేషన్ డోకు’ను చేపడతాడు. కానీ ఆ ఆపరేషన్ అనుకున్న విధంగా పూర్తికాదు. సర్దార్ ఏమయ్యాడనేది ఎవరికీ తెలియదు. మరోవైపు కాప్సిల్కు సంబంధించిన కీ ఉన్న వాల్రస్ దాడిలో చనిపోతాడు. జారా కూడా చనిపోయిందనే వార్తలు వస్తాయి.
ఇక ఏజెంట్ టైగర్ మాత్రం మాఫియా ముఠా నాయకుడు బ్లాక్ డాగర్ చేతికి చిక్కుతాడు. టైగర్ దగ్గరున్న ఒక కీని బ్లాక్ డాగర్ సొంతం చేసుకుంటాడు. మిగిలిన రెండు కీస్‌ను కూడా దక్కించుకుని, బయో వెపన్‌ను యాక్టివేట్ చేసి దేశాన్ని నాశనం చేయాలనేది అతని ప్లాన్.
మరోవైపు సర్దార్ కొడుకు విజయ్ తన తండ్రి జాడ కోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి ‘మిషన్ డోకు’ గురించి తెలుస్తుంది. అసలు తన తండ్రి ఆ ఆపరేషన్‌లో ఎందుకు విఫలమయ్యాడు? సర్దార్ ఎక్కడికి వెళ్లాడు? మిగిలిన రెండు కీస్ ఎక్కడ ఉన్నాయి? బ్లాక్ డాగర్ అసలు ఎవరు? అతను బయో వెపన్తో మానవాళిని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు? విజయ్ తన తండ్రి ఆశయాన్ని ఎలా పూర్తి చేశాడు? అనేదే మిగతా కథ.
కథ పరంగా చూస్తే.. మానవాళిని క్షణాల్లో నాశనం చేయగల బయో వెపన్, దాన్ని యాక్టివేట్ చేయాలని ప్రయత్నించే విలన్, దాన్ని డీయాక్టివేట్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలనుకునే సర్దార్.. ఈ పాయింట్ ఆసక్తికరంగానే అనిపిస్తుంది.
అదే సమయంలో తన తండ్రి కోసం విజయ్ చేసే అన్వేషణ, మిషన్ డోకు వెనుక ఉన్న అసలు కథ, కాప్సిల్‌ను ఓపెన్ చేయడానికి అవసరమైన మూడు కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? వాటిని విలన్ చేతికి చిక్కకుండా హీరో ఏం చేస్తాడు? అనే అంశాలు కూడా కథపై ఆసక్తిని పెంచుతాయి.
ఫస్టాఫ్‌లో విజయ్ తన తండ్రి జాడ తెలుసుకునే ప్రయత్నం, మిషన్ డోకు గురించి తెలుసుకోవడం వంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. విలన్ నేపథ్యం ఏంటి? అతని లక్ష్యం ఏంటి? అనే విషయాలకు ఇంటర్వెల్ దగ్గర సమాధానం లభిస్తుంది.
ఇక సెకండాఫ్‌లో హీరో, విలన్ మధ్య పోరాటమే ప్రధానంగా కనిపిస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, విమానాలు, కేబుల్ కార్లు, సొరంగ మార్గాలు ఇలా సినిమాకు భారీ స్కేల్ తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నించారు. చివర్లో దసరా నవరాత్రులు, మైసూర్ ఉత్సవాలను కూడా క్లైమాక్స్‌లో ఉపయోగించారు.
అయితే సమస్య ఏమిటంటే.. ఇంత భారీగా సన్నివేశాలను తెరకెక్కించినప్పటికీ వాటిలో కావాల్సినంత ఉత్కంఠ, ఎమోషన్ కనిపించదు. కథలో మంచి పాయింట్లు ఉన్నప్పటికీ, వాటిని తెరపై బలంగా ఆవిష్కరించడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయారనే భావన కలుగుతుంది.
ముఖ్యంగా హీరో, విలన్, బయో వెపన్ చుట్టూ నడిచే సన్నివేశాలు ప్రేక్షకుల్లో టెన్షన్ పెంచే స్థాయిలో ఉండవు. యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, కథలో ఎమోషనల్ కనెక్ట్‌ను కొంతవరకు పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది.
ఇక బయో వెపన్ నుంచి వచ్చే విషవాయువులు, విరుగుడు మందు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీళ్లు, యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే సమస్యలు వంటి విషయాలపై విలన్ ఇచ్చే వివరణలు కూడా కథ వేగాన్ని తగ్గించినట్టు అనిపిస్తాయి.
యోగిబాబు పాత్ర కూడా పెద్దగా నవ్వులు పంచలేకపోయింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలానే ఉన్నప్పటికీ.. వాటికి తగ్గట్టుగా ఎమోషనల్ సీన్స్ లేకపోవడంతో ఫైట్స్‌ను ప్రేక్షకులు ఎమోషన్‌తో కాకుండా కేవలం యాక్షన్ విన్యాసాలుగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది.
పెద్ద స్కేల్, భారీ యాక్షన్ ఉన్నప్పటికీ.. గతంలో వచ్చిన ‘సర్దార్’లో కనిపించిన గ్రిప్పింగ్ నేరేషన్, ఎమోషన్ ఇందులో కనిపించకపోవడం ప్రధాన మైనస్‌గా చెప్పొచ్చు.
నటీనటుల విషయానికి వస్తే.. తండ్రీకొడుకులుగా కార్తీ తన పాత్రలకు న్యాయం చేశాడు. అయితే కథలో బలమైన ఎమోషన్ లేకపోవడంతో ఆయన నటన కూడా పూర్తిస్థాయిలో ఎలివేట్ కాలేదు. ఎస్.జే. సూర్య తనదైన శైలిలో విలనిజంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన నటన కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది.
ఆషికా రంగనాథ్ పాత్ర పరిమితంగానే ఉంటుంది. రజీషా విజయన్‌కు కూడా పెద్దగా స్కోప్ లేదు. వీరిద్దరితో పోలిస్తే మాళవిక మోహనన్ పాత్ర కాస్త మెరుగ్గా అనిపిస్తుంది. అయితే ఆమె వయసు పైబడిన గెటప్ మాత్రం అంతగా సెట్ కాలేదు.
టెక్నికల్‌గా చూస్తే.. జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. భారీ యాక్షన్ సన్నివేశాలను విజువల్‌గా బాగానే చూపించారు. సామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. విజయ్ వేల్ కుట్టి ఎడిటింగ్ ఓ మోస్తరుగా ఉంది.
మొత్తంగా చెప్పాలంటే.. ‘సర్దార్ 2’లో భారీ యాక్షన్, ఆసక్తికరమైన కథా పాయింట్ ఉన్నప్పటికీ.. వాటికి తగ్గ స్థాయిలో కథనం, ఎమోషన్, ఉత్కంఠ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. సర్దార్ పాత్ర తెరపైకి వచ్చే వరకు ప్రేక్షకులను వెయిట్ చేయించినా.. ఆ తర్వాత కూడా కథ రొటీన్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గానే సాగుతుంది.
ఫైట్స్ మాత్రం గట్టిగానే ఉన్నాయి. కానీ వాటికి ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడంతో పెద్దగా ఇంపాక్ట్ కనిపించదు. చివరికి 2022లో వచ్చిన ‘సర్దార్’ స్థాయిని అందుకోలేకపోయిన ఒక సాధారణ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ‘సర్దార్ 2’ మిగిలిపోయిందని చెప్పొచ్చు.








