తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి హీరోయిన్ ఎంపికకు సంబంధించి ఆసక్తికరమైన వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం మేకర్స్ ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాజా ప్రచారం ప్రకారం.. హీరోయిన్గా ముందుగా నయనతారను తీసుకునేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె డేట్స్ అందుబాటులో ఉంటే నయనతారనే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో కార్తీ, నయనతార కలిసి ‘కాశ్మోరా’లో నటించగా, వారి జోడీకి మంచి స్పందన లభించింది. అలాగే మోహన్ రాజా దర్శకత్వంలో నయనతార ‘తని ఒరువన్’, ‘వేలైక్కారన్’, ‘గాడ్‌ఫాదర్’ వంటి చిత్రాల్లో నటించారు.
ఒకవేళ నయనతార డేట్స్ అందుబాటులో లేకపోతే స్టార్ హీరోయిన్ త్రిషను ఎంపిక చేసే అవకాశాన్ని కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలా జరిగితే ‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత కార్తీ-త్రిష జోడీ మరోసారి తెరపై కనిపించనుంది. అయితే హీరోయిన్ ఎంపికపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్తలు మాత్రమే కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.









