దర్శకుడు నితీశ్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ చిత్రం ట్రైలర్ విడుదల వాయిదా పడింది. శుక్రవారం ఉదయం విడుదల కావాల్సిన ట్రైలర్ చివరి నిమిషంలో నిలిపివేయడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఈ నిర్ణయానికి కారణాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు. అంతర్జాతీయ పంపిణీ హక్కుల కోసం ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కీలక ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ భాగస్వామ్యాన్ని పురస్కరించుకుని ట్రైలర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
భారతీయ ఇతిహాసమైన రామాయణంను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరవేయాలన్న తమ లక్ష్యం ఈ ఒప్పందంతో మరింత బలపడిందని నమిత్ మల్హోత్రా పేర్కొన్నారు. కొత్త ట్రైలర్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, అయితే ప్రస్తుతం ఆ తేదీని ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు.
ఈ భారీ చిత్రంలో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడి పాత్రలో యశ్ నటిస్తున్నారు. అలాగే సన్నీ డియోల్, రవి దూబే కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. చిత్రానికి ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.
‘రామాయణం’ తొలి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని, రెండో భాగాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్రణాళిక రూపొందించింది. తాజా ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పంపిణీ బాధ్యతలు చేపట్టగా, దేశీయంగా ధర్మ ప్రొడక్షన్స్ చిత్రాన్ని విడుదల చేయనుంది.









