ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం దాదాపు రూ. 10 కోట్లతో ఆధునీకరించిన పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.
జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార నిధులతో ఆధునీకరణ పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉప్పాడ-కొత్తపల్లి మండలం వాకపల్లి, ఇసుకపల్లి, నాగులాపల్లి, కొండెవరం, యు. కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంత ఆవాసాలకు చెందిన ప్రజలు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని, అరకొర నీటితో సరిపెట్టుకోవాల్సి వస్తోందన్న విషయాన్ని ఎన్నికల సమయంలో నేతలు పవన్ దృష్టికి తీసుకువచ్చారు.
జేజేఎం-అమరజీవి జలధార నిధులతో తక్షణం నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు.నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని సందర్శించి, ఆధునీకరించిన విభాగాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆధునీకరణకు సంబంధించిన ఫోటో గ్యాలరీని వీక్షించారు. కొత్త వాటర్ పైప్ లైన్ మ్యాప్ ను పరిశీలించారు. యు. కొత్తపల్లి మండల పరిధిలోని 51 ఆవాసాలు, పిఠాపురం రూరల్ మండల పరిధిలోని ఒక ఆవాసానికి తాగునీటి కష్టాలు తీర్చారు. దాదాపు 97 వేల మందికి పైగా రోజుకు తలకు 55 లీటర్ల రక్షిత తాగునీటిని అందించే విధంగా తీర్చిదిద్దారు.







