1980ల నాటి ‘ప్యారడైజ్’ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘ది ప్యారడైజ్’. తమ జాతి హక్కులు, గుర్తింపు కోసం పోరాడే సమ్మక్క పాత్రలో సోనాలి కులకర్ణి కనిపించగా.. వారి జాతిని అణగదొక్కే మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటించారు.
ఇలాంటి పరిస్థితుల్లో సమ్మక్కకు జడల్ అనే కొడుకు పుడతాడు. అతడే నాని. తన జాతి కోసం జడల్ ఎలాంటి పోరాటం చేశాడు? తల్లిపై అతనికి ఎందుకు ద్వేషం పెరిగింది? సమ్మక్క చేసిన తప్పేంటి? చివరికి తల్లి–కొడుకుల బంధం కథను ఎలాంటి మలుపు తిప్పింది? తన జాతి గుర్తింపు, హక్కుల కోసం జడల్ మొత్తం వ్యవస్థను ఎలా ఎదిరించాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథ.
ఇక సినిమాకు ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. నాని మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. జడల్ పాత్రలో అతను చూపించిన వేరియేషన్స్, ఎమోషన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో నాని పెర్ఫార్మెన్స్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపిస్తుంది.
మోహన్ బాబు కూడా మాలిక్ పాత్రలో తనదైన ముద్ర వేశారు. ఆయన పాత్రకు దర్శకుడు మంచి డెప్త్ ఇవ్వడంతో నాని పాత్రకు దీటుగా నిలిచింది. ఇక హీరోయిన్ కయదు లోహర్ తన గ్లామర్‌తో ఆకట్టుకోగా.. తల్లి పాత్రలో సోనాలి కులకర్ణి మంచి నటన కనబరిచారు. ప్రియదర్శి, రాఘవ్ జుయల్, విక్రమ్ రెడ్డి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
1980–90ల బ్యాక్‌డ్రాప్‌ను తీసుకుని కమర్షియల్ సినిమాకు భిన్నమైన కాన్సెప్ట్‌తో కథను చెప్పే ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌ను కూడా దర్శకుడు బాగానే డీల్ చేశాడు.
అయితే సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కథలో బలమైన ఎమోషన్, కాన్‌ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ.. వాటితో ప్రేక్షకుడు పూర్తిగా కనెక్ట్ అయ్యే స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడంలో కొన్ని చోట్ల లోటు కనిపిస్తుంది.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు రిపీటెడ్‌గా అనిపించడంతో సినిమా స్పీడ్ తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. హీరో–విలన్ ట్రాక్‌ను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా.. ఆ స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు.
ఇక టెక్నికల్‌గా చూస్తే సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు వర్క్ చాలా బాగుంది. 1980ల నాటి ప్రపంచాన్ని, యాక్షన్ సన్నివేశాలను విజువల్‌గా చాలా ఎఫెక్టివ్‌గా చూపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి ఇంపాక్ట్ ఇచ్చాయి. ఎడిటింగ్ కూడా బాగుంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా తన మార్క్ చూపించినప్పటికీ.. కథనం విషయంలో మరింత పకడ్బందీగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
ఓవరాల్‌గా ‘ది ప్యారడైజ్’లో నాని నటన, భారీ విజువల్స్, వైల్డ్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే స్లో నేరేషన్, ముఖ్యంగా సెకండాఫ్‌లో తగ్గిన ఆసక్తి సినిమాకు మైనస్‌గా మారాయి.
యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి, నాని అభిమానులకు ‘ది ప్యారడైజ్’ నచ్చే అవకాశముంది. కానీ బలమైన కథనం, వేగవంతమైన స్క్రీన్‌ప్లే కోరుకునే వారికి మాత్రం కొన్ని సన్నివేశాలు నిరాశ కలిగించవచ్చు.








