టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ‘బుట్టబొమ్మ’గా అభిమానుల మన్ననలు పొందిన ఈ భామ, కొంతకాలంగా టాలీవుడ్‌లో పెద్దగా కనిపించకపోవడానికి వరుస పరాజయాలతో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టడమే కారణంగా చెప్పొచ్చు.
అయితే ఇప్పుడు పూజా హెగ్డే మళ్లీ తెలుగు సినిమాల్లో తన జోరు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘శ్రీశ్రీ’ అనే చిత్రంలో నటిస్తున్న ఆమెకు, మరో క్రేజీ తెలుగు ప్రాజెక్ట్‌లో అవకాశం వచ్చినట్లు సమాచారం.
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కాంబినేషన్‌లో దర్శకుడు హసిత్ గోలి ఓ ఆసక్తికరమైన మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే రవితేజ ఎనర్జీకి, పూజా హెగ్డే గ్లామర్‌కు మంచి క్రేజ్ ఉండటంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. వీరిద్దరి జోడీ తెరపై ఎలా ఉండబోతుందనే చర్చ కూడా మొదలైంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పూజా హెగ్డే నిజంగానే ఈ సినిమాలో భాగమవుతుందా? ఈ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో మళ్లీ తన మార్క్ చూపిస్తుందా? అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.









