ప్రస్తుతం భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో బాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న ‘రామాయణం’ కూడా ఒకటి. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ఎపిక్ మూవీలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో, యష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ ట్రైలర్‌ను మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించగా, అక్కడి నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఆన్‌లైన్‌లో ట్రైలర్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ట్రైలర్ రిలీజ్ కోసం ఫిక్స్ చేసిన రోజు రానే వచ్చినప్పటికీ, మేకర్స్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. కొత్త ట్రైలర్ రిలీజ్ డేట్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
అయితే అదే సమయంలో ఒక భారీ అప్‌డేట్‌ను కూడా అందించారు. ‘రామాయణం’ను గ్లోబల్ స్థాయిలో విడుదల చేయడానికి హాలీవుడ్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్‌తో కలిసి పనిచేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేసే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
ట్రైలర్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉన్నప్పటికీ, సోనీ పిక్చర్స్ భాగస్వామ్యం మాత్రం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.









