గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘దేవర’ విజయానంతరం ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ అభిమానులకు మరో బిగ్ సర్ప్రైజ్ కూడా దక్కింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఎన్టీఆర్ కాంబో అధికారికంగా ప్రకటించబడింది. #NTRxTrivikram అనే వర్కింగ్ టైటిల్‌తో విడుదల చేసిన పోస్టర్లో… “శివుడి కుమారుడు… పార్వతి దేవికి గర్వకారణం… దేవసేనాని… మరోసారి త్రివిక్రమ్‌తో” అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నారు. మొదట ఈ కథను మరో స్టార్ హీరోతో తెరకెక్కించే ఆలోచన ఉన్నప్పటికీ, చివరికి ఎన్టీఆర్తోనే ఈ ప్రాజెక్ట్‌ను లాక్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ సినిమా గురించి రోజురోజుకు ఆసక్తికరమైన ప్రచారం పెరుగుతోంది. ఇటీవల నాగవంశీ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు, అలాగే ఎన్టీఆర్ చేతిలో ‘లార్డ్ మురుగన్’ పుస్తకం కనిపించడం అభిమానుల్లో ఎన్నో ఊహాగానాలకు తెరతీసింది.
ఇప్పుడు హీరోయిన్‌పై కొత్త చర్చ మొదలైంది..!
తెలుగు ప్రేక్షకులకు ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో పరిచయమైన మలయాళ నటి మంజిమా మోహన్, ఇటీవల తన సోషల్ మీడియాలో అదే ‘లార్డ్ మురుగన్’ పుస్తకంతో దిగిన ఫోటోను షేర్ చేసింది. దీంతో ఆమెనే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేశారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
మంజిమా మోహన్ గతంలో ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ చిత్రంలో నారా భువనేశ్వరి పాత్రలో నటించారు. అనంతరం కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తిక్‌ను ప్రేమించి 2022లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఎంపిక చేసిన సినిమాలకే పరిమితమైన ఆమె… ఇప్పుడు మళ్లీ ఓ భారీ తెలుగు ప్రాజెక్ట్‌తో రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
మరోవైపు, త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్‌తో చేస్తున్న సినిమాను పూర్తి చేసిన వెంటనే ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ప్రముఖ రచయిత ఆనంద్ బాలసుబ్రమణియన్ రచించిన ‘లార్డ్ మురుగన్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.
అయితే మరో ఆసక్తికర అంశం ఏమిటంటే… పురాణాల ప్రకారం మురుగన్‌కు ఇద్దరు భార్యలు ఉంటారు. ఒకరు దేవసేన, మరొకరు వల్లి. ఈ నేపథ్యంలో సినిమాలో ఒకటి కంటే ఎక్కువ మంది హీరోయిన్లు ఉండే అవకాశం ఉందనే చర్చ కూడా మొదలైంది.
అసలు మంజిమా మోహన్ నిజంగానే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారా? లేక ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా? దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.









