ఎన్టీఆర్–త్రివిక్రమ్ కొత్త సినిమాపై వివాదం.. తమిళనాడులో నిషేధించాలంటూ సీమాన్ డిమాండ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇంకా చిత్రీకరణ ప్రారంభం కాకముందే వివాదంలో చిక్కుకుంది. సినిమా కథాంశానికి సంబంధించిన ప్రచారం తమిళనాడులో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తమిళ జాతీయవాద నేత సీమాన్ ఈ చిత్రాన్ని తమిళనాడులో నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఘాటుగా స్పందించారు.
ఇటీవల చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ విడుదల చేసిన పోస్టర్లో, “ఉత్తరాదిన పుట్టి.. దేశ హృదయంలో రూపుదిద్దుకుని.. దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కథ విశ్వానికి చెందబోతోంది” అనే సందేశం కనిపించింది. ఈ పోస్టర్‌తో సినిమా సుబ్రహ్మణ్య స్వామి, అంటే మురుగన్ లేదా కార్తికేయుడి కథ ఆధారంగా తెరకెక్కుతోందనే ప్రచారం మరింత ఊపందుకుంది.
అయితే, పోస్టర్‌లోని వ్యాఖ్యలు మురుగన్ జన్మస్థానాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నాయంటూ తమిళనాడులోని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమిళుల ఆరాధ్య దైవమైన మురుగన్‌ను వారి సంస్కృతి నుంచి వేరు చేసి చూపించే ప్రయత్నంగా దీనిని వారు భావిస్తున్నారు.
ఈ అంశంపై స్పందించిన సీమాన్, తమిళుల చరిత్రను, సంస్కృతిని వక్రీకరించేలా సినిమా రూపొందిస్తే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా, తమిళుల మనోభావాలను గౌరవిస్తూ ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, థియేటర్ల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన “తమిళమే మురుగన్… మురుగనే తమిళం. ఈ రెండూ విడదీయరానివి” అని వ్యాఖ్యానించారు.
జూన్ 29న పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. అయితే, ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశకు కూడా చేరుకోలేదు. వివాదంపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ అంశం రానున్న రోజుల్లో మరింత చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.








