తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓటీటీ రిలీజ్ టైమింగ్ నుంచి థియేటర్ల రెంటల్ వ్యవస్థ వరకు పలు అంశాలపై నెలకొన్న విభేదాలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. పరిస్థితి రోజురోజుకీ క్లిష్టంగా మారుతుండటంతో, సమస్యల పరిష్కారం కోసం ‘యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ ఈరోజు అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది. టాలీవుడ్ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
అసలు గొడవ ఏంటి?
ఈ వివాదానికి ప్రధాన కారణం థియేటర్ల నిర్వహణ విధానం, అలాగే ఓటీటీ రిలీజ్ పాలసీ. ప్రస్తుతం థియేటర్లను ఫిక్స్డ్ రెంటల్ మోడల్లో నడపడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. అందుకే సినిమా కలెక్షన్లలో వాటా వచ్చేలా ‘పర్సెంటేజ్ సిస్టమ్’ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక మరోవైపు, థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని రోజులకే సినిమాలు ఓటీటీలోకి రావడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం థియేటర్ రిలీజ్ తర్వాత 6 నుంచి 8 వారాల వరకు సినిమాలను ఓటీటీలో విడుదల చేయకుండా కఠినమైన నిబంధనలు పెట్టాలని వారు కోరుతున్నారు.
నిర్మాతల కౌంటర్
అయితే ఎగ్జిబిటర్ల డిమాండ్లను నిర్మాతలు పూర్తిగా అంగీకరించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్సెంటేజ్ విధానం అమలు చేయడం సాధ్యం కాదని, పాత తరహా రెంటల్ మోడల్‌నే కొనసాగించాల్సి ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు.
సినిమా బడ్జెట్లు భారీగా పెరిగిపోయిన ఈ సమయంలో కలెక్షన్లలో వాటాలు పంచుకుంటే నిర్మాతలు మరింత ఒత్తిడికి గురవుతారని గిల్డ్ అభిప్రాయపడుతోంది. అలాగే ఓటీటీ డీల్స్ అనేవి నిర్మాతల వ్యాపార నిర్ణయాలని, వాటిపై పరిమితులు విధించడం సరైంది కాదని స్పష్టం చేస్తున్నారు.
ఇక ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చినా… ప్రేక్షకులపై భారం పడుతుందని భావించిన ఎగ్జిబిటర్లు టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదని చెబుతున్నారు. అయితే రెంటల్ విధానం కంటే పర్సెంటేజ్ సిస్టమ్ తమకు లాభదాయకమని వారు గట్టిగా వాదిస్తున్నారు.
టాలీవుడ్‌పై ప్రభావం?
ఈ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే టాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే పెద్ద సినిమాల విడుదలకు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. థియేటర్ల లభ్యత తగ్గడం, లేదా కొన్ని చోట్ల ప్రదర్శనలు ఆగిపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఈరోజు జరుగుతున్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశంలో ఎగ్జిబిటర్లతో చర్చలకు ఒక మధ్యేమార్గం కనిపెట్టే ప్రయత్నం జరగొచ్చని సమాచారం. మరి ఈ సంక్షోభానికి టాలీవుడ్ పెద్దలు ఎలాంటి పరిష్కారం చూపిస్తారో చూడాలి.








