భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.4 వేల కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ గురించి ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు ఉండాల్సిన స్థాయిలో ప్రమోషన్స్ మాత్రం కనిపించడం లేదనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందు వరుసగా పోస్టర్లు, గ్లింప్స్, టీజర్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో మేకర్స్ భారీ ప్రచారం చేస్తుంటారు. కానీ ‘రామాయణ’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ప్రారంభంలో ఒక గ్లింప్స్, పాత్రల పరిచయ వీడియో విడుదల చేసిన తర్వాత ఎలాంటి అధికారిక అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో మరో భారీ ప్రాజెక్ట్ అయిన రాజమౌళి-మహేష్ బాబు సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందేలా అంతర్జాతీయ వేదికలపై గ్లింప్స్ ప్రదర్శిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో ‘రామాయణ’ మేకర్స్ కూడా ఇదే తరహాలో ప్రమోషన్స్ ఎప్పుడు ప్రారంభిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే సినిమా అనౌన్స్ అయి చాలా కాలం గడిచింది. షూటింగ్ కూడా వేగంగా కొనసాగుతున్నప్పటికీ, కొత్త పోస్టర్, టీజర్ లేదా ఇతర అధికారిక అప్డేట్స్ లేకపోవడంతో సినిమా నిర్ణయించిన సమయానికే విడుదల అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌కు మేకర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
ముఖ్యంగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే జూలై 14న ప్రత్యేక కార్యక్రమంతో ప్రపంచవ్యాప్తంగా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్ మిశ్రమ స్పందనను అందుకున్న నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్‌పైనే ఉంది. ఈ ట్రైలర్‌తో ‘రామాయణ’ మేకర్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటారా? రూ.4 వేల కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్ భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టిస్తుందా? అన్నది చూడాలి.








