టాలీవుడ్లో 17 ఏళ్లుగా చెక్కుచెదరని ఓ భారీ రికార్డు… ఇప్పుడు సమంత చేతిలో బద్దలైంది! మహిళా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తూ తెలుగు సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసింది.
ఇప్పటివరకు మహిళా ప్రధాన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అనుష్క నటించిన ‘అరుంధతి’ అగ్రస్థానంలో కొనసాగింది. 2009లో విడుదలైన ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసి 17 ఏళ్ల పాటు తన రికార్డును నిలబెట్టుకుంది.
అయితే ఇప్పుడు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ ఆ రికార్డును కేవలం 10 రోజుల్లోనే అధిగమించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, పదో రోజు భారత్‌లో రూ.5.30 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ చిత్రం… దేశీయంగా మొత్తం రూ.48.25 కోట్ల నెట్, రూ.55.86 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసింది. విదేశాల్లో మరో రూ.22.85 కోట్ల గ్రాస్ రాబట్టడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు రూ.78.71 కోట్లకు చేరుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. పదో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే రూ.4.50 కోట్ల గ్రాస్ వసూలు కాగా, కర్ణాటకలో రూ.1.10 కోట్లు, తమిళనాడులో రూ.41 లక్షల గ్రాస్ నమోదైంది.
దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే తన నిర్మాణ వ్యయానికి నాలుగు రెట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే… ఈ చిత్రం త్వరలోనే రూ.100 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ మార్క్‌ను అందుకుంటుందా? లేక మరిన్ని రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.








