మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చి బాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 31న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, షూటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడింది. అయితే తాజాగా చిత్ర నిర్మాతలు అధికారికంగా ఈ సినిమాను జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మేకర్స్ కూడా అదే లక్ష్యంగా శరవేగంగా పనులను పూర్తి చేస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం తాజాగా ఎడిటింగ్ పనులను కూడా ముగించినట్లు వెల్లడించింది. దీంతో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్, ఫైనల్ మిక్సింగ్ వంటి పనులను వేగంగా పూర్తి చేస్తూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఇక విడుదలకు ముందే అభిమానుల్లో మరింత హైప్ పెంచేలా మేకర్స్ మరో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యే ప్రీమియర్స్‌ను ఈసారి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. జూన్ 3వ తేదీ నుంచే ఓవర్సీస్తో పాటు పలు ప్రాంతాల్లో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఈ వార్తతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్, ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలతో మాత్రం అభిమానులను పూర్తిగా మెప్పించలేకపోయారు. దీంతో ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ పూర్తిగా Peddi పైనే నిలిచాయి. ముఖ్యంగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఒక పాత్ర క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండగా, మరో పాత్ర కుస్తీ పోటీల నేపథ్యంలో కనిపించబోతుందట. ఇక మూడో పాత్ర మాత్రం సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని, దాన్ని థియేటర్లలోనే సర్ప్రైజ్గా రివీల్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా ఇప్పటివరకు పెద్ది నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. మరి జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.







