గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జూలై 9 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ఏడాది విడుదలైన తెలుగు చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా ‘పెద్ది’ నిలిచింది. ఇప్పుడు అదే జోరును డిజిటల్ ప్లాట్ఫారమ్పైనా కొనసాగించాలని మేకర్స్ భావిస్తున్నారు.
దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని దాదాపు మూడు సంవత్సరాల పాటు ఎంతో శ్రమించి తెరకెక్కించారు. ‘ఉప్పెన’ తర్వాత మరోసారి తన మార్క్ చూపించిన ఆయనకు ఈ సినిమా మరో పెద్ద విజయాన్ని అందించింది. ఇక రామ్ చరణ్ కూడా ఇంతకు ముందెన్నడూ కనిపించని మాస్ లుక్, పవర్ఫుల్ నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. ‘రంగస్థలం’ తర్వాత చరణ్ కెరీర్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన అంటూ సినీ విశ్లేషకులు ప్రశంసించారు.
సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. శ్రుతి హాసన్ స్పెషల్ సాంగ్‌లో సందడి చేశారు. అలాగే కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, ‘మిర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు, తారక్ పొన్నప్ప తదితరులు ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
జూలై 9 నుంచి ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్ మాత్రం కొద్దిరోజుల ఆలస్యంగా, ఆగస్టు తొలి లేదా రెండో వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘పెద్ది’కి బాలీవుడ్, ఓవర్సీస్ మార్కెట్లలో ఆశించిన స్థాయి స్పందన రాలేదు. దీంతో ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరింత మంది ప్రేక్షకులను చేరుకోవాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరి థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన ‘పెద్ది’… డిజిటల్ ప్లాట్ఫారమ్పైనా అదే స్థాయి రికార్డులు నమోదు చేస్తుందా? జూలై 9 తర్వాత సమాధానం దొరకనుంది.








