సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి ఉప్పల్ బాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రత్యేకమైన ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, వాయిస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలు.. ఇటీవల వికారాబాద్‌లోని ప్రసిద్ధ అనంతగిరి ఘాట్ రోడ్డుపై థార్ కారుపై నిలబడి చేసిన స్టంట్ వీడియోలతో భారీ చర్చకు దారితీశాడు.
ఆ వీడియోలు వైరల్ కావడంతో.. పవిత్ర పుణ్యక్షేత్రం వద్ద ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం ఏమిటని నెటిజన్లు మండిపడ్డారు. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.
స్టంట్ ఎందుకు చేశానంటే…
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదంపై స్పందించాడు ఉప్పల్ బాలు.
తన స్వగ్రామం వెన్నచేడు అని, అక్కడ లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు. అదే కార్యక్రమంలో అన్నదానం కూడా నిర్వహించాల్సి ఉండగా.. ఆ వేడుక వాయిదా పడి జూలై 5కు మార్చినట్లు చెప్పాడు.
చాలా రోజుల తర్వాత స్వగ్రామానికి వెళ్లడంతో.. “సెలబ్రిటీ అయ్యాక ఊరికి రావడం మానేశావు” అని గ్రామస్తులు చెప్పారని, అందుకే వారిని కలిసి తనకు ఇష్టమైన దేవాలయంలో దర్శనం చేసుకున్నానని తెలిపాడు.
అక్కడి నుంచి తిరిగి వస్తుండగా అనంతగిరి ఘాట్ రోడ్ అందంగా కనిపించడంతో.. తన బావ కొత్తగా కొనుగోలు చేసిన థార్ కారులో సరదాగా స్టంట్ చేశామని, దాని వెనుక ఎలాంటి చెడు ఉద్దేశం లేదని బాలు వివరించాడు.
“నన్నెవరూ అరెస్ట్ చేయలేదు”
“మీ వీడియో చూసి చిన్నపిల్లలు అనుకరిస్తే ఎలా?” అని యాంకర్ ప్రశ్నించగా.. ఆ సమయంలో అలాంటి విషయం అసలు ఆలోచించలేదని బాలు చెప్పాడు.
అలాగే ఇలా చేయడం తప్పు కాదా? అని అడగగా.. ఇలాంటి స్టంట్లు చాలా మంది చేస్తుంటారని, కొందరు రేసుల్లో చేతులు వదిలేసి మరీ డ్రైవింగ్ చేస్తారని చెప్పాడు. రాజకీయ నాయకులు కూడా కొన్నిసార్లు ఇలాంటి విన్యాసాలు చేస్తుంటారని ఉదాహరణగా చెబుతూ తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేస్తారని తెలియదా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. తనకు అలాంటి విషయం తెలియదని, ఇప్పటివరకు తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశాడు.
బిగ్‌బాస్ 10పై మనసులో మాట
ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయం కూడా బయటపెట్టాడు ఉప్పల్ బాలు. తాను అనంతగిరి ఆలయానికి వెళ్లిన అసలు కారణం.. బిగ్‌బాస్ సీజన్ 10లో అవకాశం రావాలని దేవుడిని ప్రార్థించడమే అని వెల్లడించాడు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బాలుకు మద్దతుగా అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ ఉప్పల్ బాలు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే షోలో రచ్చ మామూలుగా ఉండదని, తన స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే.. బిగ్‌బాస్ టైటిల్ గెలిచే సత్తా కూడా బాలుకే ఉందని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఎన్నాళ్లుగానో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్న ఉప్పల్ బాలు కల ఈసారి నిజమవుతుందా? లేదా? అనేది చూడాలి.








