సామర్లకోట పట్టణంలోని విజన్ మల్టీస్పెషల్టి ఆసుపత్రుల డైరెక్టర్ డాక్టర్ మహోన్నత్ కు సైబర్ నేరగాల నుంచి ఫేక్ ఫోన్ కాల్ వచ్చింది.
ఆసుపత్రికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ పన్ను బకాయి ఉందని,దానికి సంబంధించి మీపై కేసు నమోదు అయిందంటూ ఫోన్ లో బెదిరింపులు వచ్చాయి. సుమారు పది నిమిషాల పాటు సాగిన ఫేక్ ఫోన్ కాల్ లో అవతలి వ్యక్తి తాను సామర్లకోట మున్సిపల్ కమిషనర్ నంటూ మీ ఆసుపత్రికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ పన్ను బకాయిలు అధికంగా ఉన్నాయని, ఇప్పటివరకు వాటిని చెల్లించకుండా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని, దానిపై ప్రస్తుతం మీపై కేసు నమోదు అయిందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
తాను ట్రేడ్ లైసెన్స్ విషయంలో ఎలాంటి బకాయి లేకుండా ఎప్పటికప్పుడే చెల్లిస్తున్నట్టు డాక్టర్ అవతలి వ్యక్తికి వివరణ ఇచ్చారు. అయినప్పటికీ చెల్లించిన రసీదులను తమకు వాట్సప్ చేయాలని,కేవలం రూ850 మాత్రమే ట్రేడ్ లైసెన్స్ పన్ను కాదని ఇంకా అధికంగా ఉందని దానిపై తమకు పూర్తి వివరణ ఇవ్వాలని సైబర్ మోసగాళ్లు డాక్టర్ ను బెదిరించేందుకు ప్రయత్నించారు.అయితే తాను మున్సిపల్ కార్యాలయానికి వచ్చి తమను సంప్రదిస్తామని,తాము చెల్లించిన పన్నుల తాలూకు రసీదులను తీసుకుని వస్తానని డాక్టర్ సమాధానం ఇచ్చారు.
ఈ క్రమంలో ఫేక్ కాల్ చేసిన వ్యక్తి మీతో తమ పై అధికారి మాట్లాడతా రంటూ వేరే వ్యక్తి తో మాట్లాడించి బెదిరించేందుకు ప్రయత్నించారు. ఫోన్ కాల్ ముగిసిన అనంతరం డాక్టర్ ఆలోచనలో పడి సామర్లకోట మున్సిపల్ కమిషనర్ మహిళా అధికారిణి కాగా తాను కమిషనర్ నంటూ పురుషులు ఫోన్ చేయడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు.దానితో ఇది సైబర్ నేరగాళ్ల మోసపూరిత ఫోన్ కాల్ అని నిర్ధారణకు వచ్చి ఈ విషయాన్ని విలేకరులకు వివరించారు.ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ మహోన్నత్ సూచించారు.