రోజుకు వేయ్య నుంచి పదకొండు వందల లారీలు ఎగుమతులు జరిగేలా కాకినాడ పోర్టులో అదనంగా మరో రెండు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ పోర్టులో రోజువారి జరిగే పోర్టు కార్యకలాపాలకు, కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్మికులకు నష్టం వాటిల్లకుండా ప్రక్షళణలో భాగంగా కొంతమేర జాప్యం జరుగుతుందని దీనిని అధిగమించేందుకు మరో రెండు కొత్త చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడంతో పాటు టెక్నికల్ సిబ్బందిని అదనంగా నియమించడం జరుగుతుందన్నారు. ఏ ఒక్కరి మీద కక్షసాధింపు చర్యలు ఉండవని పారదర్శకతతో, నిజాయితీగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్.. స్థానిక ఎమ్మెల్యే కొండబాబు, రెవిన్యూ, పౌరసరఫరాల, కస్టమ్స్, లీగల్ మెట్రాలజీ, పోలీస్ అధికారులతో కలిసి కాకినాడ యాంకరేజ్ పోర్టు ప్రాంతాలను పరిశీలించారు. కాకినాడ పోర్టు బొంబాయి కాటా వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ ను పరిశీలించారు. అదేవిధంగా అక్కడ ఉన్న వ్యే బ్రిడ్జ్ ను, బిల్లింగ్ పత్రాలను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరో రెండు చెక్ పోస్ట్ లకు అనువైన ప్రదేశం నిమిత్తం కాకినాడ పోర్టుకు వెళ్లే ఇతర మార్గాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు.
