దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా అంటేనే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి’ సినిమాను తెరకెక్కిస్తున్న జక్కన్న.. ఈ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారనే చర్చ ఇప్పటికే మొదలైంది. ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో రాజమౌళి తదుపరి హీరో ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది.
‘బాహుబలి 2’ తర్వాత రాజమౌళి ఎక్కువ సమయం తీసుకోకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ ప్రాజెక్ట్‌నే ‘ఆర్ఆర్ఆర్’గా తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్నారు. దీంతో ‘వారణాసి’ తర్వాత కూడా జక్కన్న ఇదే వేగంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తారా అనే ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం రాజమౌళి నెక్ట్స్ హీరోల రేసులో అల్లు అర్జున్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో బన్నీకి ఉన్న క్రేజ్, భారీ యాక్షన్ పాత్రలకు సరిపోయే ఫిజిక్, పాత్ర కోసం ఎక్కువ సమయం కేటాయించే సామర్థ్యం వంటి అంశాలు ఆయనకు ప్లస్‌గా మారుతున్నాయని టాక్. అయితే బన్నీ ఇప్పటికే ఉన్న కమిట్‌మెంట్స్, డేట్స్ రాజమౌళి ప్రాజెక్ట్‌కు ఎలా సరిపోతాయనేది కీలకంగా మారనుంది.
మరోవైపు కన్నడ స్టార్ హీరో యశ్ పేరు కూడా ఈ లిస్ట్‌లో బలంగా వినిపిస్తోంది. ‘కేజీఎఫ్’ సిరీస్ కోసం ఎన్నో ఏళ్లు ఒకే ప్రాజెక్ట్‌కు కేటాయించిన యశ్.. భారీ సినిమాల కోసం ఎక్కువ సమయం కేటాయించగలడనే విషయం ఇప్పటికే నిరూపించాడు. దీంతో రాజమౌళి–యశ్ కాంబినేషన్‌పై కూడా సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఇక తమిళ స్టార్ హీరో సూర్య పేరు కూడా కొంతకాలంగా రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించి వినిపిస్తోంది. అయితే అల్లు అర్జున్, యశ్, సూర్య పేర్లలో ఇప్పటివరకు ఏ హీరోతో రాజమౌళి సినిమా చేయబోతున్నారనే విషయంపై అధికారిక ప్రకటన రాలేదు.
‘వారణాసి’ తర్వాత జక్కన్న తన తదుపరి హీరోను 2027లోనే ప్రకటిస్తారా? ‘బాహుబలి 2’ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో చూపించిన వేగాన్నే మరోసారి కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. బన్నీ, యశ్, సూర్యలో ఎవరు జక్కన్న నెక్ట్స్ హీరో అవుతారో, లేక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మరో స్టార్‌ను ఎంచుకుంటారో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.







