పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రస్తుతం నిర్మాణానంతర పనులలో వేగం పెంచింది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా డబ్బింగ్ పనులను అధికారికంగా ప్రారంభించింది. మంగళవారం ఉదయం పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, హరీష్ శంకర్ రాసిన పవర్‌ఫుల్ డైలాగ్స్‌కు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో గొంతును అందించబోతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించబోతున్నారు. త్వరలోనే పవన్ డబ్బింగ్ థియేటర్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా..’ పాట మరియు గ్లింప్స్ అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, స్వాగ్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను 2026 మార్చి 26న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం వాయిదా పడటంతో, ఆ స్థానాన్ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భర్తీ చేయనున్నట్లు టాలీవుడ్ టాక్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమవుతోంది.









