కోరంగి వైల్డ్ లైఫ్ అభయారణ్యం ఎకో-సెన్సిటివ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీకి అధికారులు సూచనలు, సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి కోరారు. స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి జిల్లా అటవీశాఖ అధికారి డి. రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి కోరంగి వైల్డ్ లైఫ్ అభయారణ్యం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీపై అటవీ, రెవెన్యూ, మత్స్య, భూగర్భ జలాలు, పశుసంవర్ధక, ఉద్యాన, మున్సిపల్ కార్పొరేషన్, సర్వే ఇతర శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్ ఓ రవీంద్రనాథ్ రెడ్డి కోరంగి వైల్డ్ లైఫ్ అభయారణ్యం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీ ఆవశ్యకతను సభ్యులకు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభయారణ్యం బయట ఉన్న సరిహద్దు నుంచి వివిధ ప్రదేశాల్లో 26 కిలోమీటర్లు దూరం వరకు ఎకో- సెన్సిటివ్ జోన్ ఉంటుందన్నారు. ఈ జోన్ వల్ల వన్యప్రాణుల స్వేచ్ఛకు, మునుగడకు మరింత భద్రత ఏర్పడుతుందన్నారు. పర్యావరణ సమతుల్యత నెలకొని పచ్చదనం పెపొందడంతో పాటు సేంద్రియ వ్యవసాయానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ జోన్ పరిధిలో వర్షపు నీటిని వివిధ పద్ధతుల్లో నిలువ చేసుకుని జంతువులకు నీటి సమస్య లేకుండా చేయవచ్చునని ఆయన వివరించారు.
ఈ నేపథ్యంలో తిరువనంతపురం సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ వారు ఎకో-సెన్సిటివ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నారని దీనికి సంబంధించి సంబంధిత శాఖల అధికారులు తమ సూచనలు, సలహాలు అందించి ఎకో-సెన్సిటివ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తయారిలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులకు సూచించారు.