తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలపు పెంపుపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇచ్చారు. మద్యం ధరల పెంపుపై విశ్రాంత హైకోర్టు జడ్జీతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోరామని, అది వచ్చిన తర్వాతే ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల విక్రయాలు నిలిపివేస్తామని యూబీఎల్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు.
వివిధ బ్రాండ్ల బీర్ల ధరలు పెంచాలని కోరుతున్నారని మంత్రి జూపల్లి తెలిపారు. బీర్ల ధరలు 33.1 శాతం పెంచాలని యునైటెడ్ బ్రూవరీస్ (UB) కంపెనీ కోరుతోందన్నారు. ధరలు పెంచితే మద్యం కస్టమర్లపై భారం పడుతుందన్నారు. ముడి సరుకుల ధరలు పెరిగితే మద్యం ధరలు పెరుగుతాయని చెప్పారు. యూబీఎల్ కంపెనీ మార్కెట్ షేరు 69 శాతంగా ఉందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తంగా దాదాపు రూ. 8 లక్షల కోట్ల వరకు అప్పులు, బకాయిలు పెట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వాటికి నెలకు రూ. 6 వేల కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. మరో రూ. 40 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో పెట్టారని చెప్పారు. ఇందులో ఎక్సైజ్ శాఖకు సంబంధించి రూ. 2500 కోట్ల వరకు ఉన్నాయన్నారు. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ. 1139 కోట్ల బకాయిలు చెల్లించామని, ఇవాళ్టి వరకు మొత్తం రూ. 658 కోట్లు పెండింగ్ ఉందని మంత్రి జూపల్లి వివరించారు.
యూబీ బీర్లకు సంబంధించి రాష్ట్రంలో ఇంకా 14 లక్షల కేసుల స్టాక్ ఉందని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. కర్ణాటకలో బీరు రూ. 190, ఏపీలో 180, తెలంగాణలో 150, తమిళనాడులో 150గా ఉందని తెలిపారు.
యూపీ కంపెనీ ఒత్తిడికి లొంగమని.. భవిష్యత్తులోనూ మిగితా రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే మద్యం ధరలు తక్కువగా ఉండేలా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కాగా, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో, బీర్ల ధరలు పెంచకపోవడంతో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు యూబీ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.









