తమిళనాడులో రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు అన్నామలై విన్నూత్న నిరసన చేస్తున్నారు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడిలో న్యాయం జరిగే వరకు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకె ప్రభుత్వం గద్దె దిగే వరకు ఆయన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో భాగంగానే ఆయన శుక్రవారం తనను తాను కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న షాకింగ్ వీడియోలో తమిళ బిజేపీ నాయకుడు అన్నామలై షర్టు లేకుండా పచ్చ కలర్ లుంగీలో నిలబడ్డారు. చేతిలో కొరడా తీసుకొని తన వీపుపై ఆరు సార్లు కొరడాతో తానే కొట్టుకన్నారు. ఏడవ సారి కొట్టుకోబోతే ఆయన అనుచరుడు మధ్యలో వచ్చి ఆయనను ఆపి కౌగిలించుకున్నాడు. ఇదంతా తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో భాగమని తెలిపారు. రాష్ట్రంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె పార్టీని గద్దె దించేందుకు ఆయన 48 రోజుల మహా దీక్ష చేపట్టారు. ఈ 48 రోజులు ఆయన పచ్చ లుంగీలోనే ఉంటారు. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల వరకు అన్నామలై చెప్పులు లేకుండానే నడుస్తానని శపథం చేశారు.
ఈ దీక్ష గురించి శుక్రవారం కొయంబత్తూరులోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నా యూనివర్సిటీలో లైంగిక దాడి కేసులో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం విచారణలో జాప్యాన్ని ఆయన ఖండించారు. “తమిళ సంస్కృతి గురించి తెలిసిన వారందరికీ కొరడాతో తమను తాము శిక్షించుకోవడం గురించి తెలుసు. ఇది మన సంప్రదాయం. ఈ నిరసన ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాత్రమే కాదు. రాష్ట్రంలో అడ్డూఅదుపులో లేకుండా సాగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నిరసన చేస్తున్నాను. అన్నామలై యూనివర్సిటీలో జరిగిన లైంగిక దాడులు కేసు కేవలం పైకి కనిపిస్తున్న రవ్వ మాత్రమే. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో అందరూ గమనించాలి. సామాన్యులు, మహిళలు, చిన్నపిల్లలు అందరికీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తూ ఉంది. అందుకే నేను ఈ నిరసన చేయాలని నిర్ణయించుకున్నాను. ఇలా కొరడాతో శిక్షించుకోవడం మా వంశ సంప్రదాయం.” అని ఆయన అన్నారు.
మరోవైపు చెన్నై నగరంలోని అన్నా యూనివర్సిటీ లో చదువుకునే యువతిపై కొన్ని రోజుల క్రితం లైంగిక దాడి జరిగింది. ఆమె స్నేహితుడిని కొందరు చితకబాదారు. ఈ కేసులో 37 ఏళ్ల ఒక ఫుడ్ స్టాల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు నేరం అంగీకరించాడని కూడా పోలీసులు మీడియాకు వెల్లడించారు.
అయితే ఈ కేసులో నిందితులకు ప్రభుత్వం అండదండలున్నాయని ప్రతిపక్ష పార్టీలైన ఎఐఎడిఎంకె, బిజేపీలు విమర్శలు చేస్తున్నాయి. గత బుధవారం అన్నామలై డిఎంకె ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. తమిళనాడులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, నేరస్తులకు రాష్ట్రం అడ్డాగా మారిపోయిందని.. ప్రభుత్వం అండదండలతో క్రిమినల్స్ రెచ్చిపోతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.